Nov 16,2023 21:58

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌, చిత్తూరు: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న కుల గణనకు సంబంధించి క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు మాస్టర్‌ ట్రైనర్స్‌ ఈనెల 17 నుంచి సిద్ధంగా ఉన్నారని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.రాజశేఖర్‌ అన్నారు. గురువారం సాయంత్రం డిఆర్‌ఓ ఛాంబర్‌లో జడ్పీ సీఈఓ ప్రభాకర్‌ రెడ్డితో కలసి అధికారులతో కుల గణన గురించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ కులగణన వల్ల సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చునని అన్నారు. దేశంలో స్వాతంత్రానికి ముందు 1931లో ఈ కార్యక్రమం నిర్వహించారని, దాని ఆధారంగానే నేటికీ ప్రణాళికలు రూపొందుతున్నాయని అయితే ప్రభుత్వం తాజాగా ఈకార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. సచివాలయం యూనిట్‌గా సచివాలయ సిబ్బంది వాలంటీర్ల సహకారంతో కుటుంబాల నుంచి వ్యక్తిగత సమాచారం సామాజిక హోదా సంబంధించిన సమాచారం సేకరించాల్సి ఉంటుందని ఈ సమాచారం ప్రజలు స్వచ్ఛందంగా తెలియజేయాలని అన్నారు. ప్రజల నుంచి సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ప్రభుత్వ రక్షణలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కుల గణన ఆధారంగా సంక్షేమ పథకాలు తొలగింపు ఉండదని స్పష్టం చేసిన డిఆర్‌ఓ పత్రాలు జారీకి కుల గణనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఈ కార్యక్రమం ఈనెల 27 నుంచి ప్రారంభించనుండగా ఈనెల 17 నుంచి మండల స్థాయిలో అధికారులకు అవగాహన కల్పించేందుకు మాస్టర్‌ ట్రైనర్స్‌ నియమించినట్లు తెలిపారు. చిత్తూరు అర్బన్‌ చిత్తూరు గుడిపాల యాదమరి మండలాలకు సంబంధించి డిప్యూటీ కలెక్టర్‌ శివయ్య, తవనంపల్లి, బంగారుపాలెం, ఐరాల, పెనుమూరు మండలాలకు బంగారుపాలెం ఎంపీడీఓ హరి ప్రసాద్‌రెడ్డి, పలమనేరు అర్బన్‌, పలమనేరు, పెద్దపంజాణి మండలాలకు సంబంధించి పలమనేరు మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌కుమార్‌, పుంగనూరు అర్బన్‌, పుంగనూరు, సోమల, చౌడేపల్లి మండలాలకు సంబంధించి డిఎల్‌డిఓ పలమనేరు ఉమావాణి, కుప్పం అర్బన్‌, కుప్పం రూరల్‌, శాంతిపురం, గుడిపల్లి మండలాలకు సంబంధించి ఎంపీడీఓ శాంతిపురం హేమమాలిని, రామకుప్పం, వి.కోట, బైరెడ్డిపల్లి, గంగవరం మండలాలకు సంబంధించి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మూర్తి, పూతలపట్టు, సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాలకు సంబంధించి పులిచెర్ల తహశీల్దార్‌ శేషగిరిరావు, గంగాధర్‌ నెల్లూరు, పాలసముద్రం, ఎస్‌ఆర్‌ పురం, వెదురుకుప్పం మండలాలకు సంబంధించి చిత్తూరు డిఎల్డిఓ రవికుమార్‌, కార్వేటి నగరం, నగరి అర్బన్‌, నగరి రూరల్‌, విజయపురం మండలాలకు సంబంధించి కార్వేటినగరం తహశీల్దార్‌ రవికుమార్‌లను నియమించగా వీరికి నోడల్‌ అధికారిగా జిల్లా పరిషత్‌ సీఈఓ ప్రభాకర్‌ రెడ్డి వ్యవహరించనున్నారు. సమావేశంలో బీసీ వెల్ఫేర్‌ అధికారి రబ్బానీ బాష, డిడి సోషల్‌ వెల్ఫేర్‌ రాజ్యలక్ష్మి, మైనారిటీ సంక్షేమ అధికారి చిన్నారెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి మూర్తి, ఎస్‌ఈ కార్పొరేషన్‌ ఈడీ నరసింహులు, ఎస్డిసి డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ శివయ్య, ఈడీ బీసీ కార్పొరేషన్‌ శ్రీదేవి, పలమనేరు మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌కుమార్‌, డ్వామా ఏపిడి ఉమావాణి, పులిచెర్ల తాసిల్దార్‌ శేషగిరిరావు, కార్వేటినగరం తహశీల్డార్‌ రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.