Aug 16,2023 14:42

ట్రిపోలీ : లిబియా రాజధాని ట్రిపోలీలో రెండు సాయుధ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో కనీసం 27 మంది మృతి చెందారు. వందమందికిపైగా గాయపడ్డారని లిబియా అత్యవసర సేవల ప్రకటనను ఉటంకిస్తూ సిఎన్‌ఎన్‌ న్యూస్‌ ఛానెల్‌ వెల్లడించింది. ఈ ఘర్షణల్లో దాదాపు 106 మందికి గాయాలయ్యాయని అత్యవసర సేవల విభాగం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. 444 బ్రిగేడ్‌ కమాండర్‌ మహమూద్‌ హంజా ట్రిపోలీలోని మిటా విమానాశ్రయంలో సోమవారం అదుపులోకి తీసుకున్న తర్వాత ఘర్షణలు మొదలైనట్లు సిఎన్‌ఎన్‌ తెలిపింది. అయితే హంజా విడుదల తర్వాత ఘర్షణలు సద్దుమణిగినట్లు నగర నివాసితులు తెలిపారు. అయితే హంజా నిర్బంధానికి గల కారణం తెలియదని మీడియా పేర్కొంది. మృతుల్లో పౌరులు కూడా ఉన్నారని లానా న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. ఈ ఘర్షణల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి.. జాతీయ ఐక్యత (నేషనల్‌ యూనిటీ) ప్రభుత్వం పరిహారాలను జారీ చేయనుంది. లిబియాలోని యునైటెడ్‌ నేషనల్స్‌ సపోర్ట్‌ మిషన్‌ ఇన్‌ లిబియా (యుఎన్‌ఎస్‌ఎంఐఎల్‌) మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ట్రిపోలీలో క్రితం రోజు జరిగిన ఘర్షణలు పౌరులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో నిశితంగా పరిశీలిస్తోంది. పౌరులను రక్షించడానికి అంతర్జాతీయ చట్టం ప్రకారం తమ బాధ్యతను కలిగి ఉన్న అన్ని పార్టీలకు మిషన్‌ గుర్తు చేస్తుంది అని యుఎస్‌ఎన్‌ఎంఐఎల్‌ ప్రకటన పేర్కొంది.