ప్రజాశక్తి-విజయనగరం : దేశవ్యాప్త కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాల పిలుపు మేరకు విజయవాడలో ఈనెల 27,28 తేదీల్లో జరిగే కార్మిక,రైతు మహాధర్నాకు జిల్లా నుంచి వందలాదిగా కదిలిరావాలని కార్మికులకు,రైతులకు, ప్రజలకు ఎపి రైతు సంఘం పిలుపునిచ్చింది. మంగళవారం ఎన్‌పిఆర్ భవనంలో కేంద్ర కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్ అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ కార్మికులకు, రైతులకు, ప్రజలకు, దేశానికి వ్యతిరేకమైన వినాశకర కార్పొరేట్ అనుకూల విధానాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని అధికారం నుండి దింపటమే మార్గమన్నారు. కొత్తగా కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు ఈ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేయడానికి భయపడే స్థాయిలో కార్మిక,రైతు ఐక్య పోరాటాలు పెరగాలని, ఈ నేపథ్యంలో విజయవాడ మహాధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. పోరాటాలకు తలొగ్గి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఆ సందర్భంలో కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును వెనక్కి తీసుకుంటామని చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను లేబరు కోడ్‌ల రూపంలో కాలరాస్తోందన్నారు. పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచుతామని ప్రకటిస్తున్నాయని తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారానికి ప్రతి సంవత్సరం కనీసం ఒకసారి జరగాల్సిన త్రైపాక్షిక భారత కార్మిక మహాసభను మోడీ ప్రభుత్వం 2015 నుండి జరపటం లేదన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్ ను పునరుద్ధరించాలని కోరుతూ పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, నిర్ణీత కాలపరిమితి ఉద్యోగాల పేర్లతో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పర్మినెంట్ ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులు, ప్రజల తిరుగుబాట్లతో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించలేని మోడీ ప్రభుత్వం నగదీకరణ పేరుతో ప్రజల ఆస్తులైన విద్యుత్, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, జాతీయ రహదారులను లీజుకు కార్పొరేట్లకు ఎటువంటి పెట్టుబడి పెట్టకుండానే ధారదత్తం చేస్తోందని అన్నారు. విద్యుత్తు, ఇంటిపన్నులు, రవాణా ఛార్జీలను పెంచి కార్మికులపై భారాలు మోపుతోందన్నారు. బిజెపి విషపూరిత మతతత్వ విధానాలను విమర్శించటానికి సైతం ప్రభుత్వంలోని వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు సిద్ధపడటం లేదన్నారు. ఈ నేపథ్యంలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు, జిల్లా అధ్యక్షులు ఎస్.గోపాల్, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు మొదిలి శ్రీనివాసరావు, ఐఎఫ్‌టియు జిల్లా ఉపాధ్యక్షులు అప్పలసూరి, రైతు సంక్షేమ జిల్లా అధ్యక్షులు లక్ష్ము నాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.అప్పారావు, జి. శ్రీనివాస్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్. రాములు, క్రాంతికార్ సంఘం నాయకులు తిరుపతిరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.లక్ష్మి, బి.సుధారాణి, పట్టణ అధ్యక్షులు జగన్మోహన్, జిల్లా కమిటీ సభ్యులు బలస శ్రీను, ఎ.సురేష్, బి.జసూర్యనారాయణ, పెంటరాజు పాల్గొన్నారు.