
27, 28న విజయవాడలో మహాధర్నా
- జయప్రదం చేయండి
- కార్మిక, కర్షక, రైతు సంఘాల నేతలు
ప్రజాశక్తి - నంద్యాల
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కర్షక కార్మిక సామాన్య ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 27, 28న విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కార్మిక, కర్షక, రైతు సంఘాల నేతలు కోరారు. ఈ నెల 27, 28 తేదీలలో విజయవాడలో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ సన్మాహక సమావేశం మంగళవారం నంద్యాల పట్టణంలోని స్థానిక నరసింహయ్య భవనంలో రైతు సంఘం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, ఐఎఫ్‌టియు, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి రమేష్ కుమార్, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎ.నాగరాజు, యేసురత్నం, వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి చౌడప్ప, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మార్కు మాట్లాడారు. గత రెండు సంవత్సరాల క్రితం ఢిల్లీలో జరిగిన నల్ల మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం మహా పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ కొనసాగింపులో భాగంగా బిజెపి విధానాలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా ఈనెల 27, 28 తేదీలలో రాష్ట్ర కేంద్రాలలో లక్షలాదిమందిగా మహా ధర్నాలు నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ మహాధర్నాలో సంయుక్త కార్మిక కర్షక సంఘాలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రైతులు పండించిన పంటలన్నింటికీ సమగ్ర ఉత్పత్తి వేయటానికి 50 శాతం కలిపి ఎంఎస్‌పిలను నిర్ణయించి చట్టబద్ధత కల్పించాలని, రైతుల పాలిట శాపంగా మారిన ఎలక్ట్రిసిటీ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులందరికీ పంట రుణాలు అందించాలని, రైతు రుణ ఉపశమన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించి రైతుల ఆత్మహత్యలను అరికట్టాలని కోరారు. కార్మికులకు నష్టం కలిగిస్తున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, డైలీ వేజ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకం 200 రోజులు పనులు కల్పించి రోజువారి వేతనం రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను కల్పించాలని, వలస కార్మికుల సమగ్ర విధానాన్ని రూపొందించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని తదితర డిమాండ్లను అమలు కోరుతూ ఈ మహా ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. బిజెపి ప్రభుత్వ మతోన్మాత విధానాలను ఖండిస్తూ రాబోయే ఎన్నికల్లో ఓడించే విధంగా ఈ మహా ధర్నా చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు మద్దులు, గౌస్, లక్ష్మణ్, బాల వెంకట్, వెంకట లింగం, వ్యకాసం నాయకులు డేవిడ్, రత్నమయ్య, వీరభద్రుడు, రైతు సంఘం జిల్లా నాయకులు రామచంద్రుడు, సుబ్బారాయుడు, గౌడ్, నాయకులు పాల్గొన్నారు.