Nov 05,2023 20:23

మాట్లాడుతున్న యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జి.మంగశ్రీ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఈ నెల 27, 28వ తేదీల్లో విజయవాడలో జరిగే మహా పడావ్‌ను విజయవంతం చేయాలని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల శానిటేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జి.మంగశ్రీ పిలుపునిచ్చారు. ఆదివారం ఎన్‌పిఆర్‌ శ్రామిక భవన్‌లో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహనరావు అధ్యక్షతన ఎపి మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల శానిటేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం, శానిటేషన్‌ కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నాయని మండిపడ్డారు. నెలకు రూ.3 వేలు వేతనంతో మోడీ, జగన్మోహన్‌ రెడ్డి జీవించగలరా? అని ప్రశ్నించారు. ధరలు ఆకాశంలో ఉంటే మెనూ ఛార్జీలు, వేతనాలు పాతాళంలో ఉన్నాయన్నారు. అవి కూడా సకాలంలో చెల్లించకపోవడంతో కార్మికుల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సౌకర్యం కూడా లేదన్నారు. శానిటేషన్‌ శానిటేషన్‌ కార్మికులకు రూ.6 వేలు ఇచ్చి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేయిస్తున్నారని, రెండు నెలలుగా జీతాలు కూడా చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మేమంటూ ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలకు మధ్యాహ్న భోజన పథకం, శానిటేషన్‌ కార్మికుల సమస్యలు ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు.
కనీస వేతనాలు రూ.26 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత, ఇఎస్‌ఐ, పిఎఫ్‌, చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సుధారాణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, నగర కార్యదర్శి బి.రమణ, రాంబాయి, అచ్చియమ్మ, స్వప్న, రమాదేవి, నారాయణమ్మ, బేగం, లక్ష్మి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.