
బలిజిపేట: ఈనెల 27, 28 తేదీల్లో తలపెట్టిన కార్మిక, రైతు మహా ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదివారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో సిఐటియు మండల అధ్యక్షులు లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వంజరాపు సత్యంనాయడు మాట్లాడారు. దేశవ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ రైతు సంఘాల పిలుపుమేరకు విజయవాడలో ఈనెల 27,28 తేదీల్లో జింఖాన్ మైదానంలో జరిగే కార్మిక రైతు మహా ధర్నాకు రైతులు, కార్మికులు కదిలి రావాలని కోరారు. కార్మికులకు, రైతులకు, ప్రజలకు వ్యతిరేకమైన వినాశకర కార్పొరేట్ అనుకూల విధానాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దూకుడుగా అమలు చేస్తుందని, ఇటువంటి ప్రభుత్వాన్ని అధికారం నుండి దింపటమే మార్గం అని అన్నారు. కొత్తగా కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేయడానికి భయపడే స్థాయిలో కార్మిక, రైతు ఐక్య పోరాటాలు పెరగాలని పిలుపునిచ్చారు. ఈ దిశలో విజయవాడ మహాధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను నియంత్రించాలని, ఆహారం, మందులు, వ్యవసాయ ఉపకరణాలపై జిఎస్టి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌పై ఎక్సైజ్ పన్నులు గణనీయంగా తగ్గించాలని, రైల్వే రాయితీలు పునరుద్ధరించాలని, పాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. ప్రజా పంపిణీ పథకాన్ని విస్తతం చేసి ఆహార భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, లీజు విధానం రద్దు చేయాలని,విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. ఉపాధి హామీ పనులు 200రోజుకు పెంచి, రూ.600 వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజనం తదితర స్కీం వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం, పెన్షన్, గ్రాట్యూటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, అసంఘటిత కార్మికులకు సమగ్ర సామాజిక సంక్షేమం అమలు చేయాలని తదితర సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన కార్మికులు, రైతులు ఐక్యపోరాటాల్లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు రైతు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకటస్వామి, ఇందిర, శ్రీదేవి, కృష్ణవేణి, ప్రసాదు, సావిత్రి, పోలమ్మ స్వర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.