27, 28 తేదీల్లో విజయవాడలో మహాధర్నా
న్యూస్‌క్లిక్ ఎఫ్‌ఐఆర్ కాపీలు దగ్ధం
ప్రజాశక్తి - తిరుపతి టౌన్
బిజెపి ప్రభుత్వ కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 27, 28 తేదీల్లో విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చారు. సన్నాహక సమావేశం బైరాగిపట్టెడలోని ఎఐటియుసి కార్యాలయంలో సోమవారం జరిగింది. ఎఫ్‌ఐఆర్ కాపీలను దగ్ధం చేశారు. న్యూస్‌క్లిక్ యాజమాన్యంపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, భావప్రకటన స్వేచ్ఛను కాపాడాలని బైరాగిపట్టెడ సర్కిల్‌నందు నిరసన తెలిపారు. అనంతరం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు నాగ సుబ్బారెడ్డి, ఎఐకెఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాలుగు లేబర్ కోడ్ల రద్దును ఉపసంహరించుకోవాలని, ఒపిఎస్‌ను పునరుద్ధరించాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైళ్లు, విమానాలు, ఎల్‌ఐసిని ప్రైవేట్‌వారికి కట్టబెట్టే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరించారు. మత విద్వేషాలు మనుకోకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పంటలన్నింటికీ ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి ఎంఎస్‌పి నిర్ణయించి చట్టబద్ధత చేయాలని, రైతులకు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే విధానాన్ని మనుకోవాలన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, వలస కార్మికులకు సమగ్ర విధానాన్ని రూపొందించాలన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా కార్యదర్శి పి.హేమలత, సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. జనార్ధన్, మునిశంకర్, హరీష్, చంద్రశేఖర్, వెంకటరత్నం, వెంకయ్య పాల్గొన్నారు.
రైతు సంఘం నిరసన
సూళ్లూరుపేట : డిల్లీలో రైతు సంఘం నాయకుల అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. అక్రమంగా రైతుల మీద పెట్టిన కేసులను ఖండిస్తూ నినాదాలు చేసి నకళ్ళను తగలపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్, లారీ వర్కర్స్ యూనియన్, లగేజ్ ఆటో వర్కర్స్ యూనియన్ సంఘీభావం తెలిపాయి. ఈ నిరసనలో సుంకర అల్లెయ్య, రమణయ్య, కె.లక్ష్మయ్య, సత్యం, సుబ్రమణ్యరెడ్డి, వేణు పాల్గొన్నారు.










