
ప్రజాశక్తి - పెదనందిపాడు రూరల్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో నిర్వహించే మహాధర్నాలో రైతులు, కార్మికులు, ఉద్యోగ సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రైతుసంఘ రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం పెదనందిపాడులోని తేళ్ల నారాయణ ,విజ్ఞాన కేంద్రంలో డి.రమేష్‌బాబు అధ్యక్షతన అఖిలపక్ష రైతు సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు నెలలుగా సరైన వర్షాల్లేవని, 28 లక్షల ఎకరాల్లో పంటలు సాగవలేదని చెప్పారు. 360 మండలాల్లో కరువు నెలకొందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 400 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, 3 వేల టీఎంసీల నీరు సముద్రం పాలైందని అన్నారు. రైతులకు విత్తనం నుండి పంట అమ్ముకునే దాకా ఆర్బికేలు చేయూతగా ఉంటాయన్న ప్రభుత్వ మాటలు డొల్లేనని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ పరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని, 60 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. అమూల్ డెయిరీ వల్ల స్థానిక పాడి రైతులు దెబ్బతింటున్నారని అన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజరు కుమార్ మాట్లాడుతూ గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగింపు పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నీటి సమస్యల వల్ల పంటలు కోల్పోయిన మండలాలను గుర్తించి కరువు మండలాలుగా ప్రకటించి రైతులు, కౌలు రైతులకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించి ఆదుకోవాలని కోరారు. సమావేశంలో నాయకులు ఎన్.ఆచార్యులు, కె.హరిబాబు. ఆర్.వినోద్, బి.శంకరయ్య, కె.వెంకట సుబ్బారావు, సిహెచ్.యానాదులు, ఎం.రమణ, ఎం.టైటాస్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : రైతు సంఘం తాడేపల్లి మండల కమిటీ సమావేశం డోకిపర్తి రాజు అధ్యక్షతన తాడేపల్లి మేకా అమరారెడ్డి భవన్‌లో జరిగింది. జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకరరావు మాట్లాడుతూ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రధాని మోడీ గతంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వ హయాంలో దేశంలో నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, కల్తీ మందుల వల్ల ప్రతి ఏటా రైతాంగం రెండు లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నారని చెప్పారు. కౌలు రైతులతో సహా రైతులందరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని కోరారు. అమరావతినే రాజధానిగా కొనసాగించడంతో పాటు రైతుల అప్పులను రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి కార్మిక హక్కులను పునరుద్దరించాలని చెప్పారు. భూ సర్వేలో జరుగుతున్న పొరపాట్లను సరి చేయాలన్నారు. రైతు సంఘం మండల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ కాల్వలో చేరుతున్న మురుగు నీటిని అరికట్టాలని, డొంక రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, చిర్రావూరు పశువుల ఆసుపత్రిలో వైద్యున్ని నియమించాలని, తాడేపల్లి బకింగ్ హోమ్ కాలువపై డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు డి.వెంకటరెడ్డి, బి.గోపిరెడ్డి, డి.బుల్లికోటిరెడ్డి, శివారెడ్డి, కౌలు రైతు సంఘం నాయకులు పి.కృష్ణ, సిఐటియు నాయకులు బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.