Nov 02,2023 01:01

గుంటూరులో మాట్లాడుతున్న వడ్డే శోభనాద్రీశ్వరరావు

ప్రజాశక్తి-గుంటూరు : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. మహాధర్నా జిల్లా సన్నాహక సమావేశం బుధవారం స్థానిక బ్రాడీపేటలోని రైతు సంఘం కార్యాలయంలో నిర్వహించారు. శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ అన్ని రకాల పంటలకూ ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించి, చట్టబద్ధత కల్పించాలని, విద్యుత్‌ బిల్లును ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ మోటార్లకు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించరాదని, కౌలు రైతులందరికీ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు అందించాలని, కేరళలో మాదిరిగా రైతు రుణ ఉపశమన చట్టం పార్లమెంట్‌లోనూ చేయాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, ఢిల్లీ రైతు పోరాటం హామీలు నెరవేర్చాలని, తదితర డిమాండ్లతో మహాధార్న జరుగుతుందన్నారు. అనంతరం ఎపి రైతు సంఘం రాష్ట్ర నాయకులు వై.కేశవరావు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్‌, ఎఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.రాధాకృష్ణమూర్తి, కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకష్ణ, రైతు కూలి సంఘం నాయకులు యు.నాగేశ్వరరావు, ఏరువాక రైతు సంఘం నాయకులు పి.కోటేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.అజరుకుమార్‌ తదితరులు మాట్లాడారు. బిజెపి అధికారంలోకి వచ్చాక వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు మరింత పెరిగాయన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా మార్పులు చేస్తూ లేబర్‌కోడ్‌లు రూపొందించారన్నారు. రాష్ట్రంలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కార్పొరేట్‌ అనుకూల పంటల బీమా పథకాన్ని ఉపసంహరించుకొని, సమగ్ర ప్రభుత్వ రంగ పంటల బీమా సంస్థను ఏర్పాటు చేయాలని డమాండ్‌ చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. ఉపాధి కూలీలకు రోజువారీ వేతనం రూ.600కు పెంచి, పనిదినాలు 200రోజులకు పెంచాలని, పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. లకింపూరి ఖేరీలో రైతులు, జర్నలిస్టులను చంపిన కేంద్ర మంత్రి కుమారుడిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా డిమాండ్ల సాధనకు జరిగే ధర్నాలో జిల్లా నుండి రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు వేలాదిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ధర్నాకు హాజరయ్యే వారికి తగిన వసతి, ఆహార ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, ప్రొఫెసర్‌ ఎన్‌.వేణుగోపాలరావు, పి.సాంబశివరావు, హనుమంతరావు, కె.రంగారెడ్డి, ఇ.అప్పారావు, బి.శ్రీనివాసరావు, కె.కోటయ్య, రంగస్వామి, ఎం.రవి, గనిరాజు, రంగారావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేటలోని సిపిఐ కార్యాలయంలో రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, రైతు సంఘం నాయకులుయ యు.రాము అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కెవిపి ప్రసాద్‌, రైతు సంఘం రాష్ట్ర నాయకులు వై.కేశవరావు మాట్లాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు రూ.15 లక్షల కోట్లను మాఫీ చేసిందని, రైతుల రుణమాఫీకి సాకులు చెబుతోందని విమర్శించారు. కేంద్రం తెచ్చిన లేబర్‌ కోడ్‌ల వల్ల కార్మికులు బానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు. కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ రైతులకిచ్చిన ఏ ఒక్క హామీనీ కేంద్ర నెరవేర్చలేదన్నారు. రానున్న కాలంలో కార్మిక, కర్షక వర్గాలు పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అఖిల భారత రైతు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు టి.ఆంజనేయులు, తెలుగు రైతు విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్ధన్‌ బాబు, వెంకటరత్నం, సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శిలు గుంటూరు విజరు కుమార్‌, ఎ.మారుతి వరప్రసాద్‌ మాట్లాడుతూ కార్మికులు, కర్షకులు చేసే పోరాటాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. సదస్సులో వివిధ సంఘాల నాయకులు కె.రాంబాబు, ఎస్‌.ఆంజనేయులు నాయక్‌, శ్రీనివాసరావు, యు.రంగయ్య, టి.బాబురావు, బి.రామకృష్ణ, డి.శివకుమారి, సిలార్‌ మసూద్‌, కె.రామారావు, జి.బాలకృష్ణ, సత్యనారాయణరాజు, అంజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాగేశ్వరావు, ఆంజనేయులు పాల్గొన్నారు.