Nov 16,2023 23:48

మాట్లాడుతున్న రాష్ట్ర నాయకులు కెఎల్‌ శ్రీనివాస్‌

ప్రజాశక్తి - చిలకలూరిపేట : అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో జరిగే మహాధర్నాను, డిసెంబర్‌ 8న జరిగే దేశవ్యాప్త ధర్నాను జయప్రదం చేయాలని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా కార్యదర్శి జి.మల్లీశ్వరి పిలుపునిచ్చారు. ఈ మేరకు పండరిపురంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడాతూ అంగన్వాడీల సమస్యలు ప్రభుత్వాలకు పట్టడం లేదని, శాసన మండలిలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు ప్రస్తావించిన సరైన సమాధానం ఇవ్వడం లేదని అన్నారు. గ్రాడ్యుటీ అమలు చేయాలని, వివిధ వివరాల అప్‌లోడ్‌ కోసం నాణ్యమైన ఫోన్లు ఇవ్వాలని, మానసికంగా ఒత్తిళ్లకు గురువుతున్నారని అన్నారు. వీటితోపాటు అద్దె, కరెంటు బిల్లులు తదితర స్థానిక సమస్యల మీద స్థానిక అన్ని ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ఈనెల 20న ధర్నాలు చేస్తామని చెప్పారు. రెండు మూడు నెలలుగా జీతాలు రాలేదని, అప్పులతో కుటుంబాలను పోషించుకోవాల్సి రావడం, సెంటర్లను నిర్వహించాల్సి రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదువుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని జీవోలున్నా సిడిపిఒలు అమలు చేయడం లేదని, దీనిపై కలెక్టర్‌కు విన్నవించినా ఫలితం లేదని అన్నారు. వీటి పరిష్కారం కోసం చేసే పోరాటాల్లో అంగన్వాడీలంతా ఐక్యంగా పాల్గొనాలని కోరారు. అనంతరం రాష్ట్ర నాయకులు కెఎల్‌ శ్రీనివాస్‌ మాట్లాడారు. ప్రాజెక్టు అధ్యక్షులు సావిత్రి, సిఐటియు మండల కన్వీనర్‌ పి.వెంకటేశ్వర్లు, ఎం.విల్సన్‌ పాల్గొన్నారు.