ప్రజాశక్తి - రాంబిల్లి
నేవల్ బేస్ నిర్వాసితులు ఎనిమిది గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళన శుకవ్రారం నాటికి 26వ రోజుకు చేరింది. నిర్వాసితులు నేవీ మెయిన్ గేటు ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నేవీబేస్ వల్ల సర్వం కోల్పోయిన తమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని, జీవన భృతి కల్పించాలని, పెండింగ్ ప్యాకేజీలు అందజేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులకు చేపలు వేటకు అనుకూలంగా జెట్టీ నిర్మించాలని, నిర్మాణ పనుల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలని, ఆధార్ కార్డు ఆధారంగానే శారద వరాహ, నదుల్లో చేపలు వేటకు పంపాలని, వ్యవసాయ భూములకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, శ్మశాన స్థలాలు కేటాయించాలని, ప్రభావిత గ్రామాలను నిర్వాసిత గ్రామాలుగా గుర్తించి ప్యాకేజీలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 8 గ్రామాల నిర్వాసితులు పాల్గొన్నారు.










