Jul 20,2023 22:50

ప్రజాశక్తి-కాకినాడ విద్యుత్‌ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల, కార్మికుల హక్కుల సాధన కోసం వారి సమస్యలను పరిష్కరించాలని, ఎపి ఎలక్ట్రిసిటీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన స్థానిక కుళాయి చెరువు వద్ద డిఇ కార్యాలయంలో డిఇ జి.ప్రసాద్‌కు వినపత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకుడు సాక శ్రీనివాస శేఖర్‌ మాట్లాడుతూ అనేక చారిత్రక ఉద్యమాలను నిర్వహించి, అనేక విజయాలు సాధించిన నేపథ్యంలో అన్ని సంఘాలూ కలిపి విజయవాడ దాసరి భవన్‌లో విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్‌ స్ట్రగుల్‌ కమిటీగా ఏర్పడ్డాయన్నారు. ఈ స్ట్రగుల్‌ ఆధ్వర్యంలో ఈనెల 26న విజయవాడలో సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సదస్సులో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని అందుకు అన్ని యూనియన్‌ లో ఉన్న విద్యుత్‌ రంగంలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు విజయవాడకు తరలి రావాలని శ్రీనివాస్‌ శేఖర్‌ పిలుపునిచ్చారు. ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ మాట్లాడారు. విద్యుత్తు రంగంలో వేతనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కోడి సత్తిబాబు, దుర్గాడ రాజు, శంకర్రావు, వెంకన్న బాబు, గణేష్‌, రవిశంకర్‌, శివరామకష్ణ, రాజు, శేఖర్‌, ఖాన్‌, బుజ్జి బాబు, రామకృష్ణ, సూర్యనారాయణ పాల్గొన్నారు.