ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, ఎన్‌టిఆర్ జిల్లాలకు చెందిన పేదలకు రాజధాని గ్రామాల్లో ఇవ్వనున్న ఇళ్లపట్టాలను ఈనెల 26న తుళ్లూరు మండలం వెంకటపాలెంలో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మూడు రాజధానుల అంశం ప్రకటించిన తరువాత 29 గ్రామాల రైతులు గత 1250 రోజులుగా ఉద్యమం కొనసాగిస్తున్నారు. 2019 డిసెంబరు17 తరువాత ఇప్పటి వరకు రాజధాని గ్రామాల్లో సిఎం జగన్ సభలు జరగలేదు. మూడున్నరేళ్లుగా వెలగపూడిలోని సచివాలయానికి కూడా భారీగా పోలీసు బందోబస్తు మధ్య వచ్చి వెళ్తున్నారు. ఏడాదికి రెండు మూడు సార్లు జరిగే అసెంబ్లీ సమావేశాలు, మంత్రివర్గ సమావేశాల నిమిత్తం తాడేపల్లి నుంచి వెలగపూడికి వస్తున్న సిఎంకు రాజధాని గ్రామాల్లో రైతులు నిరసన కన్పించకుండా పోలీసులు పరదాలు అడ్డుపెడుతున్నారు. దీంతో పరదాల చాటున సిఎం పర్యటిస్తున్నారని టిడిపి, జనసేన నాయకులు పలుమార్లు వ్యంగాస్త్రాలు సంధించారు. రాజధాని ఉద్యమం ప్రారంభమైన తర్వాత గతేడాది కరకట్ట విస్తరణ పనులకు శంకుస్థాపనలో సిఎం పాల్గొన్నా అప్పట్లో భారీ సభ జరగలేదు. గత మూడున్నరేళ్లలో అధికారిక, రాజకీయ పరమైన సభల్లోనూ సిఎం పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో రాజధానిలో తొలిసారిగా ఈనెల 26న వెంకటపాలెంలో ఇళ్ల స్థలాల పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే సిఎం పర్యటనలో రైతులు నిరసన తెలపకుండా ఎలా వ్యవహరించాలనే అంశంపై అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. వెంకటపాలెం సమీప గ్రామాలకు చెందిన రైతులు, స్థానికులను ఎలా నియంత్రించాలా? అని పోలీసు అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైసిపికి దూరం కావడంతో బాపట్ల ఎంపి నందిగం సురేష్, నియోజకవర్గం వైసిపి కన్వీనర్ కత్తెర సురేష్ సిఎం సభ జయప్రదంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
లే అవుట్‌ల పరిశీలించిన అధికారులు
వెంకటపాలెం, కృష్ణాయపాలెంలో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్‌లను బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా ఎస్‌పి ఆరీఫ్ హఫీజ్, గుంటూరు ఆర్‌డిఒ ప్రభాకరరెడ్డితో కలిసి ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ పరిశీలించారు. అభివృద్ధి పనులు, హద్దు రాళ్ల ఏర్పాటు, అప్రోచ్ రహదారుల నిర్మాణం తదితర పనులు పరిశీలించారు. బహిరంగ సభ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు.










