ప్రజాశక్తి-విశాఖపట్నం : వైఎస్‌ఆర్ రైతు భరోసా - పి.ఎమ్.కిసాన్ పథకం కింద 2022-23 సంవత్సరంలో రెండో విడత కింద విశాఖ జిల్లా వ్యాప్తంగా 26,944 మంది రైతు కుటుంబాలకు రూ.5.83 కోట్లు నేరుగా రైతుల ఖాతాలలోకి జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. సోమవారం ఉదయం పెందుర్తి మండలం, జిల్లా మహిళ సమైక్య ప్రాంగణంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్రతో కలిసి రైతులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్‌ఆర్ రైతు భరోసా - పి.ఎమ్.కిసాన్ పథకం కింద రెండవ విడత సాయాన్ని బటన్ నొక్కి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతుల ఖాతాల్లో జమ చేశారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తిలకించారు.
అనంతరం జిల్లా కలెక్టరు ఎ.మల్లికార్జున మాట్లాడుతూ, రైతు భరోసా పథకం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎవరికైనా రైతు భరోసా జమకానట్లయితే స్థానిక సచివాలయంలో తిరిగి నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి రైతు ఈ-కేవైసీ తప్పక నమోదు చేసుకోవాలని తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర మాట్లాడుతూ వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ముఖ్యమంత్రి రైతులను ఆర్థికంగా ఆదుకుంటున్నారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా మంచి ఎరువులు అందిస్తూ ముఖ్యమంత్రి రైతులకు ఎంతో వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. అనంతరం కలెక్టర్ ప్రజా ప్రతినిధులతో కలిసి 26,944 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున రూ.5,83,34,000 చెక్కును రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వ్యవసాయ శాఖ ఎడి మాణిక్యాంబిక, ఆర్‌డిఒ హుస్సేన్ సాహెబ్, తహశీల్దార్ ఆనంద్‌కుమార్, ఎంపిపి, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.










