ప్రజాశక్తి - చిలకలూరిపేట : మున్సిపాల్టీలో విలీనమైన పసుమర్రు 3 కిలోమీటర్ల దూరంలోని గుదేవారిపాలెం పంచాయతి పరిధిలో వేసిన జగనన్న ఇళ్ల స్థలాల్లో నిర్మాణం స్తంభించింది. ఇక్కడ మొత్తం 60 ఎకరాల్లో రెండు లే అవుట్లు వేశారు. వీటిల్లో 2650 ప్లాట్లు ఉన్నాయి. వీటిల్లో గ్రామీణులకు 300 ప్లాట్లు ఇవ్వగా 2156 ప్లాట్లను పట్టణ పేదలకు పంపిణీ చేశారు. 194 ప్లాట్లను ఇంకా ఎవరికీ పంపిణీ చేయలేదు.
ఈ ప్లాట్లను పంపిణీ చేసి రెండేళ్లయినా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఇంటి నిర్మాణమే పూర్తయింది. ఒక ఇంటికి పునాది కోసం గుంతలు తీసి వదిలేశారు. ఏడు ఇళ్లు శ్లాబు దశలో ఉండగా మరో 23 ఇళ్లకు పునాదికి బీములు వేశారు. పట్టణానికి దూరంగా ఉండడం, బాగా పల్లపు ప్రాంతం కావడంతో ఇక్కడ ఇంటి నిర్మాణానికి వెనకాడుతున్నట్లు లబ్ధిదార్లు చెబుతున్నారు. ఈ ప్రదేశం చాలా పల్లంగా ఉంటుందని, మెరక తోలుకోవాలంటే చాలా ఖర్చవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న రూ.1.8 లక్షలు ఇంటి నిర్మాణానికి ఏ మాత్రమూ సరిపోదని, రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుందని అంటున్నారు.
రోజూ పని చేసుకుంటే గాని తమకు ఇల్లు గడవదని, పట్టణంలోనే తామకు పని దొరుగుతుందని లబ్ధిదార్లు అంటున్నారు. సరైన రవాణా సదుపాయాల్లేని ఈ ప్రాంతానికి వస్తే తాము రోజూ 7 కిలోమీటర్ల దూరంలోని చిలకలూరిపేట పట్టణం కళామందిర్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుందని, ఇది తమకు తలకు మించిన పని అని అంటున్నారు. ఒకవేళ ధైర్యం చేసి ఎవరైనా ఇల్లు నిర్మించుకుందామనుకున్నా ఇక్కడ నీటి సదుపాయం లేదు. బోర్లు వేసినా ఉప్పు నీరు పడుతోంది. దీంతో నిర్మాణానికి అవసరమైన నీరు తెచ్చుకోవడం కష్టమవుతుందనే ఉద్దేశంతో చాలామంది వెనకడుగేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం, అధికారులు సైతం ఇళ్ల నిర్మాణాన్ని వేగవతం చేసేందుకు పెద్దగా ప్రయత్నించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటే సరికాదని, ఇంటి నిర్మాణమూ చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన నిర్మాణ సామగ్రి ధరల ప్రకారం ప్రభుత్వం ఇచ్చే మొత్తాన్ని పెంచాలని, దూరం ప్రాంతంలోని లే అవుట్‌కు మౌలిక సదుపాయాలు సమకూర్చి రవాణా సదుపాయమూ కల్పించాలని కోరుతున్నారు.
గుదెవారిపాలెం లే అవుట్‌కు నీటి సరఫరా లేదు. ఈ ప్రాంతానికి నీరు సరఫరా చేయాలంటే చిలకలూరిపేట పట్టణం నుండి కొత్తగా పైపులైన్ వేయాలి లేదా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలి. ఇప్పుడు అలాంటి ఏర్పాటు ఏమీ లేదు. పసుమర్రు నుండి ఇవ్వడం మరోమార్గం. అయితే పసుమర్రులో 800 ఇళ్లు ఉండగా వారికే చెరువు నీరు చాలక ఏడాదిలో 3సార్లు ఆ చెరువును నింపడానికి తంటాలు పడాల్సి వస్తోంది. ఇవన్నీ కాకుండా లే అవుట్‌లోకి రానున్న ప్రజలతోపాటు పసుమర్రుకు మరోవైపున ఉన్న అన్నంభొట్లవారిపాలెం వైపు లే అవుట్ 6 వేల ప్లాట్ల ప్రజలకూ నీరు ప్రత్యేకంగా సరఫరా చేయాలంటే సుమారు 30 ఎకరాల్లో చెరువును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఆ ప్రయత్నాలేమీ ఇప్పటి వరకు లేవని 15వ వార్డు కౌన్సిలర్ జాలాది సుబ్బారావు అన్నారు. శ్మశాన స్థలమూ కేటాయించలేదని, రహదారి సదుపాయమూ సరిగా లేదని చెప్పారు.










