
ప్రజాశక్తి - దుగ్గిరాల : మంగళగిరి, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల పరిధిలోని 26 వేల ఎకరాలకు నీరందించే హైలెవెల్ ఛానల్ నిర్మాణానికి రూ.కోటి కేటాయించకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకరరావు విమర్శించారు మండలంలోని పెనుమూలి పరిధిలో హైలెవెల్ ఛానల్ కింద సాగుతున్న పొలాలను రైతు సంఘం నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ గ్రామ పరిధిలోని 4 వేల ఎకరాల్లో 3500 ఎకరాలు పంట ప్రశ్నార్థకంగా మారింద న్నారు. కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన రూ.కోటి చెల్లిస్తే నిర్మాణం పూర్తవుతుందని, అయినా ఆయా ఎమ్మెల్యేలు చోద్యం చూస్తున్నారని అన్నారు. ఆయిల్ ఇంజిన్లతో పొలాలకు నీరు పెట్టాల్సి రావడంతో రైతులకు రూ.10 వేల అదనపు ఖర్చు అవుతోందని, హై లెవెల్ ఛానల్‌ను పూర్తి చేసి పొలాలకు నీరందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, హై లెవెల్ ఛానల్ పోరాట కమిటీ కన్వీనర్ ములక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ గుర్రపు డెక్క, తూటికాడ, కంపతో పంట కాల్వ నిండిపోయిందని, నీరు సైతం సరిగా పారుదల కావడం లేదని, ఆయిల్ ఇంజన్లకు కూడా నీరు సరిగా అందడం లేదని తెలిపారు. 75 శాతం కౌలు రైతులున్న ఈ ప్రాంతంలో ఎకరాకు రూ.20-25 వేలు కౌలు చెల్లించి సాగు చేస్తున్నారని, ప్రస్తుత పరిస్థితులతో పెట్టుబడి కూడా రాదేమోనని ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. హైలెవల్ ఛానల్‌ను పూర్తి చేస్తే రైతులకు ఈ దయనీయ దుస్థితి వచ్చేది కాదని అన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా సమస్యను గుర్తించి పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జె.బాలరాజు, బి.అమ్మిరెడ్డి, ఎన్.యోగేశ్వర రావు, వై.బ్రహ్మేశ్వరరావు, జె.వీరస్వామి, గోపాల్‌రెడ్డి, కె.భాస్కర్, రజాక్ పాల్గొన్నారు.