Nov 19,2023 01:19

సమావేశంలో మాట్లాడుతున్న గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి

ప్రజాశక్తి-గుంటూరు : ప్రజల సంక్షేమానికి అవసరమైన పాలసీలను తయారు చేయడానికి కులగణన ఎంతో తోడ్పడుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కులగణన-2023 చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.ఈనెల 26వ తేదీ నుండి వారం రోజులపాటు గుంటూరులో కులగణన చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కులగణన-2023పై స్టేక్‌ హోల్డర్లతో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ కులగణన ఏ రకంగా జరుగుతుంది? దీని ఆవశ్యకత గురించి వివరించారు. గతంలో 1931లో కులగణన జరిగిందని, ఇటీవల బీహార్‌ రాష్ట్రంలో కులగణన జరిగిందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ పాలసీల రూపకల్పనకు కులగణన వివరాలు ఎంతగానో తోడ్పడతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కులగణన చేపట్టేందుకు ముందుగా జిల్లాలో ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, మేథావులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించి, వారి సలహాలు స్వీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కులగణనకు ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ ద్వారా సచివాలయ సెక్రెటరీ, వాలంటీర్‌ వివరాలు సేకరిస్తారన్నారు. ప్రజలందరూ ఏ విధమైన అపోహలకు గురికాకుండా అత్యంత పారదర్శకంగా ఈ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు తమ వాస్తవ వివరాలు స్వచ్ఛందంగా తెలియజేయాలని, ఇందుకు ఎలాంటి ఆధారాలు అవసరం లేదని చెప్పారు. ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ అనేక సూచనలు చేశారు. ముఖ్యంగా చట్టబద్ధత కలిగిన ఉద్యోగులతో మాత్రమే కులగణన చేపట్టాలని, కులాలు, ఉప కులాలు వివరాలు తెలిసిన ఉద్యోగితో కులగణన చేపట్టాలని, ఇందుకు అనుభవం ఉన్న సిబ్బందితో కులగణన చేపట్టాలని, ఈ కులగణనపై గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కలిగేటట్లుగా ప్రచారం చేపట్టాలని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూధనరావు, సిపిఒ శేషశ్రీ, బీసీ కార్పొరేషన్‌ ఈడీ దుర్గాబాయి , కష్ణ బలిజ, పూసల కార్పొరేషన్‌ చైర్‌ పర్సన్‌ కోలా భవానీ, విభిన్న ప్రతిభావంతులు సీనియర్‌ సిటీజన్‌ సహాయక కార్పొరేషన్‌ చైర్‌ పర్సన్‌ ముంతాజ్‌ పఠాన్‌, డిఆర్‌ఒ కె.చంద్రశేఖర్‌రావు, ఆర్‌డిఒ పి.శ్రీఖర్‌ పాల్గొన్నారు.