ప్రజాశక్తి - శ్రీకాకుళం: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విధానాలకు సంబంధించి పౌరులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈనెల 26 నుంచి జిల్లాలో వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి రోహిత్ మాథూర్ తెలిపారు. ఈనెల 26 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు సంకల్పయాత్ర ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులపై కలెక్టరేట్‌లోని సమావేశ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు పథకాల కింద అర్హులైనా, ఇప్పటివరకు ప్రయోజనం పొందని బలహీనవర్గాలను చేరుకోవడం అవసరమన్నారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ 17 సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందుతున్న అంశంలో గణాంకాలను సవివరంగా అడిగి తెలుసుకున్నారు. పథకాల విస్తృత ప్రచారం కోసం ఏమేం చేయొచ్చని అధికారుల సూచనలు, సలహాలను కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులకు లబ్ధి చేకూరేలా ప్రచారం చేయాలన్నారు. సమావేశంలో వికసిత భారత్ సంకల్పయాత్ర జిల్లా నోడల్ అధికారి, జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, డిపిఒ వి.రవికుమార్, డిఎంహెచ్‌ఒ బి.మీనాక్షి, ఐసిడిఎస్ పీడీ బి.శాంతిశ్రీ, డిఆర్‌డిఎ, డ్వామా పీడీలు డి.వి విద్యాసాగర్, జి.వి చిట్టిరాజు, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా నోడల్ అధికారి వాసుదేవరావు, ఇతర జిల్లాస్థాయి అధికారులు, ఎంపిడిఒలు తదితరులు పాల్గొన్నారు.