Sep 20,2023 20:28

అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్ఫర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి కళ్యాణి

ప్రజాశక్తి - భీమవరం
అంగన్‌వాడీ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 25న విజయవాడలో మహా ధర్నా నిర్వహించనున్నామని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్ఫర్స్‌ యూనియన్‌ కార్యదర్శి డి.కళ్యాణి తెలిపారు. యూనియన్‌ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక సిఐటియు కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు కె.ఝాన్సీ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. అనంతరం ధర్నాకు సహకరించాలని కోరుతూ జిల్లా ప్రాజెక్టు అధికారి సుజాతారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కంటే అదనంగా వేతనాలు చెల్లిస్తామన్న ముఖ్యమంత్రి జగన్‌ వాగ్దానం అమలు కాలేదని, కనీస వేతనాలు చెల్లించాలని మహాధర్నా చేపట్టనున్నామని తెలిపారు. అంగన్‌వాడీల జీతాల పెంపు పట్ల ప్రభుత్వం సాగవేత ధోరణి అవలంబిస్తోందన్నారు. వాగ్దానాలు చేయడం తప్ప అమలు లేదని విమర్శించారు. జీతాలతో పాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, గ్రాడ్యుటీ అమలు చేయాలని, అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వమే గ్యాస్‌ సరఫరా తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నా, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హామీలివ్వడం తప్ప సమస్యలు పరిష్కారం చేయడం లేదని వాపోయారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 25న విజయవాడలో మహాధర్నా చేయనున్నామని తెలిపారు. రాష్ట్ర యూనియన్‌ సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు ధర్నాలో పాల్గొనాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో యూనియన్‌ జిల్లా నాయకులు వైట్ల ఉషారాణి, పి.నాగరత్నం, మేరీ, రాజామణి, విజయలక్ష్మి, పెద్దింట్లు, దీన కుమారి, అనురాధ, రామకోటి ఉన్నారు.