Sep 23,2023 00:10

ప్రజాశక్తి - నిజాంపట్నం
అంగన్వాడీల వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ, పెన్షన్ అమలు చేయాలని కోరుతూ ఈనెల 25న విజయవాడలో ధర్నా జరుగుతుందని పల్లపట్ల ప్రాజెక్టు సిడిపిఒకు సిఐటియు ఆధ్వర్యంలో అంగనవాడీ కార్యకర్తలు వినతి పత్రం అందజేశారు. ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్స్ పాల్గొంటున్నట్లు తెలియజేస్తూ వినతి పత్రంలో పేర్కొన్నారు. అంగనవాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు వై మేరీమణి, ప్రాజెక్ట్ గౌరవ అధ్యక్షులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతు రాష్ట్రంలో గత 48సంవత్సరాలుగా గర్భవతులు, బాలింతలు, 6ఏళ్లలోపు పిల్లలకి సేవలు అందిస్తున్న అంగన్వాడిలకు కనీస వేతనాలు అమలుకావటం లేదన్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీలు అమలు కాలేదని అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్, మినీ వర్కర్స్, హెల్పర్స్‌కు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణా కన్న అదనంగా వేతనాలు ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యూటీని తక్షణమే అమలుచేయాలని కోరారు. రాష్ట్రంలోని మినీ సెంటర్లన్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరారు. మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. ఎఎఫ్ఆర్ఎస్, వివిధ రకాల యాప్‌లను రద్దుచేసి ఒకే యాప్ ద్వారా విధులు నిర్వహించే విధంగా చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు మాదిరి రిటైర్మెంట్ వయసు 62సంవత్సరాలుకు పెంచాలన్నారు. ఆఖరి వేతనంలో 50శాతం పెన్షన్ ఇవ్వాలన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలన్నారు. గ్యాసును ప్రభుత్వమే సరఫరా చెయ్యాలని కోరారు. పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు, 2017టిఎ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరారు. నాణ్యమైన సరుకులు ఖచ్చితమైన కొలతలతో ప్రతినెల 5వ తేదీలోపు సెంటర్లకు అందించాలన్నారు. సమస్యలు పరిష్కారం చేయకుండా పోలీసులు ద్వార అక్రమ అరెస్టుల, నోటిసులు ఇచ్చి నిర్భంధం ప్రయోగిస్తే తగ్గిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.