ప్రజాశక్తి - పెదనందిపాడు : తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రాన్ని 25వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభించనునట్లు సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు తెలిపారు. ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మన్ బివి రాఘవులు హాజరవుతారన్నారు. ఈ మేరకు కరపత్రాలను మండల కేంద్రమైన పెదనందిపాడులో గురువారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన ప్రచారంలో రామారావు మాట్లాడుతూ పెదనందిపాడు మండలం పాలపర్రులో జన్మించిన నారాయణ అనేక ఉద్యమాలు, పోరాటాలలో పాల్గొన్నారని, ఆయన స్ఫూర్తిని కొనసాగించడానికి విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించామని చెప్పారు. పెదనందిపాడు ప్రాంతంలో జాతీయ ఉద్యమంలో పర్వతనేని వీరయ్య చౌదరి నాయకత్వంలో పన్నుల నిరాకరణ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగిందని, నల్లమడ రైతుల సమస్యలు, గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగింపు కోసం ఆందోళన ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో అభ్యుదయ భావజాలాన్ని ప్రచారం చేయడానికి తేళ్ల నారాయణ పేరుతో అనేకమంది దాతల సహకారంతో పెదనందిపాడులోని లావువారివీధిలో విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించామని తెలిపారు. విద్యార్థులకు పోటీ పరీక్షల శిక్షణ, మహిళలకు కుట్టు శిక్షణ, ట్యూషన్ పాయింట్ యువకులకు కంప్యూటర్ శిక్షణ, బాలల మనోవికాసానికి వివిధ కార్యక్రమాలు, చర్చగోస్టుల నిర్వహణకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని వివరించారు. ప్రారంభోత్సవానికి ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు, సిపిఎం జిల్లా నాయకులు కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ పెదనందిపాడులో జరిగే అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాలకు ఈ విజ్ఞాన కేంద్రం కేంద్ర బిందువుగా ఉంటుందని అన్నారు. ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, విజ్ఞాన్ సంస్థల చైర్మన్ లావు రత్తయ్య, ఇతర ప్రముఖులు హాజరవుతారని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి డి.రమేష్ బాబు, నాయకులు కె.శ్రీనివాసరావు, జె.రామారావు, కె.వెంకటశివరావు, కె.వెంకటసుబ్బారావు, కె.శివనాగేశ్వరరావు, సిహెచ్.యానాదులు, ఎం.రమణ, డి.శ్రీనివాసరావు, కె.బాబు పాల్గొన్నారు.










