Aug 09,2023 00:28

ప్రజాశక్తి - పెదనందిపాడు రూరల్‌ : మండల కేంద్రమైన పెదనందిపాడులో నిర్మిస్తున్న తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రాన్ని ఈనెల 25న ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రకటించారు. ప్రారంభోత్సవానికి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. నిర్మాణంలో ఉన్న విజ్ఞాన కేంద్రం వద్ద వివిధ ప్రజా సంఘాల విస్తృత సమావేశం కె.హరిబాబు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. రామారావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువులు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. వీటిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దీన్ని పక్కదారి పట్టించడానికి బిజెపి మతచిచ్చు పెడుతోందని, ఏకరూప పౌరస్మృతి ఇందులో ఒక భాగమన్నారు. మణిపూర్‌లో మూణ్ణెల్లుగా అల్లర్లు జరుగుతున్నా ఆ రాష్ట్రాన్ని ప్రధాని మోడీ సందర్శించకపోవడం దుర్మార్గమన్నారుః. మణిపూర్‌ ఘటనల్లో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. జిల్లా నాయకులు కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ విభజన చట్టం హామీల అమలును విస్మరించి రాష్ట్రానికి కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. అయినా రాష్ట్రంలోని వైసిపి, టిడిపిలు బిజెపికి మద్దతుగా నిలవడం అన్యాయమన్నారు. సిపిఎం మండల కార్యదర్శి డి.రమేష్‌బాబు మాట్లాడుతూ గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకూ పొడిగించడానికి సత్వరమే పనులు చేపట్టాలని, అందుకుగాను నిధులు కేటాయించాలని కోరారు. లేకుంటే ఆందోళనకు పూనుకుంటామని చెప్పారు. సమావేశంలో కె.శివనాగేశ్వరరావు, జి.రమేష్‌, పి.భువనేశ్వరి, కె.బాబు, డి.శ్రీను, ఎన్‌.ఆచార్యులు, ఎం.వెంకటేశ్వర్లు, జె.రామారావు, కె.శ్రీను, ఎం.రమణ, సిహెచ్‌.యానాదులు, ఎల్‌.నాగేశ్వరరావు పాల్గొన్నారు.