ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు-ప్రస్తుత రాజకీయ పరిణామాలపై సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. ఈ సభకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు తదితరులు హాజరు అవుతారన్నారు. ఈ మేరకు ఆదివారం బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటాయని, మరోవైపు ప్రజలకు సరైన ఉపాధి లేక పేదల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెబుతుందని విమర్శించారు. భిన్నంత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో ఏకరూప పౌరస్మృతిని తెస్తూ ప్రజల మధ్య విభజనను సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. మణిపూర్‌లో గత 3 నెలల నుండి తెగల మధ్య విభేదాలు సృష్టించారని, మైనార్టీపై సంఘపరివార్ శక్తులు మూకదాడులు చేస్తూ, చర్చీలపై దాడులు, గృహదహనాలు, సామూహిక హత్యలు, మహిళలను వివస్త్రను చేసి ఊరేగించడం వంటి దారుణాలకు పాల్పడుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని మండిపడ్డారు. వేలాది కేసులు పోలీస్‌స్టేషన్‌లో బాధితులు పెట్టినా నిందితులను అరెస్టు చేయకపోవడం, రాష్ట్ర ముఖ్యమంత్రి దాడులు చేస్తున్న వారికి మద్దతు పలకడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా, రాజధాని నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖ రైల్వే జోన్‌కు నిధులు కేటాయించకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని అన్నారు. అయినా రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలకడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, కస్టమర్ ఛార్జీల పేరుతో విధ్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపిందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగ ఐక్యంగా ఉద్యమించాలని, ఈ నేపథ్యంలో జరిగే సభలో ప్రజలు ఎక్కువ మంది పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.నళినీకాంత్, ఇ.అప్పారావు, నాయకులు బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.










