Sep 20,2023 20:10

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నాయకులు

కడప అర్బన్‌ : వర్షాభావ దష్ట్యా కరువు మండలాలను ప్రకటించాలని ఈ నెల 25వ తేదీన మండల కేంద్రాలలో ధర్నాలను జయప్రదం చేయాలని ఎపి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు దస్తగిరిరెడ్డి, అన్వేష్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఎపి రైతు సంఘం జిల్లా కార్యాలయంలో కరప త్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు దష్ట్యా జిల్లాలో కరువు మండలాలను ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితితో రైతులు అరకొర పంటలు వేశారని, అప్పులు చేసి, వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వేసిన పంటలు ఎండు దశకు వచ్చాయని తెలిపారు. పత్తి, వేరుసెనగ, మిర్చి, మొక్క జొన్న, ఆముదం, కంది, మినుము వంటిపంటలు కూడా సకాలంలో వర్షాలు లేక సగానికి సగం దెబ్బతిన్నాయని చెప్పారు. బోరు బావుల కింద ఉన్న అరకొర పంటలను కాపాడుకుందామంటే విద్యుత్‌ సరఫరా సక్రమంగా ఉండడం లేదని పేర్కొన్నారు. విద్యుత్‌ కోతలతో ఉన్న కొద్దిపాటి పంటలు దెబ్బ తింటుంటున్నా యని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ప్రణాళిక లేమితో చోద్యం చూస్తోం దని విమర్శించారు. కనీసం వేసిన పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొన్నారు. ఇ-క్రాప్‌ నమోదు చేయటంలో కూడా సర్వర్‌, నెట్‌వర్క్‌ సమస్య, యాప్‌ డౌన్లోడ్‌ కాకపోవడం వంటి కారణాలతో పంటల నమోదు సక్రమంగా చేయటం లేదని తెలిపారు. వర్షాభావంతో పంటలు దెబ్బతిన్న అన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా గుర్తించి, కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంటనుబట్టి ఎకరాకు రూ.40 వేలు నుంచి రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. పంటలు వేయని రైతులకు ఎకరాకు రూ.20 వేలు జీవన భతిగా ఇవ్వాలని పేర్కొన్నారు. రైతులు, కౌలు రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని, కౌలు రైతు లకు కౌలు రద్దు చేయాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకంలో అదనంగా 100 రోజులు పనులు పెట్టాలని, వ్యవసాయ మోటర్లకు 9 గంటల విద్యుత్‌ నిరంతరాయంగా అందించి ఉన్న పంటలను కాపాడాలని తెలిపారు. ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికను రూపొందించి రబీలో పంటలు వేసేం దుకు 90 శాతం సబ్సిడీతో రైతులకు ప్రభుత్వం విత్తనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 25వ తేదీన తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట జరిగే ధర్నాకు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు నిచ్చారు. కరపత్రాల ఆవిష్కరణలో ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణయ్య పాల్గొన్నారు.