ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : ప్రస్తుత రాజకీయ పరిణామాలపై గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈనెల 25న మధ్యాహ్నం 3 గంటలకు సభ నిర్వహించనున్నట్లు సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు తెలిపారు. సభకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు హాజరవుతారని చెప్పారు. మండలంలోని ఖాజాలో గురువారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో రామారావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి నిత్యాసర, పెట్రో, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచిందని, ప్రజల ఆదాయాలు మాత్రం పెరగడం లేదని అన్నారు. మణిపూర్లో మూణ్ణెల్లుగా దాడులు జరుగుతున్నా కేంద్రం నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. విదేశాలు పట్టుకు తిరుగుతున్న ప్రధాని మోడీ మణిపూర్‌ను మాత్రం సందర్శించడం లేదన్నారు. రాజ్యాంగ విలువలకు కేంద్రంలోని బిజెపి తిలోదకాలిస్తోందని, మైనార్టీలపై దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికి హక్కులు లేకుండా లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు అధికారాన్ని కట్టబెడుతూ రాష్ట్రాల హక్కులపైనా దాడి చేస్తోందన్నారు. ఏపీకి విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా అన్యాయం చేస్తోందని, అయినా ఇక్కడి అధికార ప్రతిపక్షాలు బిజెపిని భుజాన మోయడం సిగ్గుచేటని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, నాయకులు బి.కోటేశ్వరి, ఇ.నాగేంద్రారెడ్డి, ఇ.ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.










