Aug 08,2023 22:29

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు

* సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు
* ముగిసిన విఆర్‌ఎల దీక్ష
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే ఈనెల 25న చలో విజయవాడ చేపడతామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, విఆర్‌ఎల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు అల్లు సత్యనారాయణ హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యాన విఆర్‌ఎలు కలెక్టరేట్‌ సమీపాన జ్యోతిరావు పూలే పార్కు వద్ద చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్థాయిలో రెవెన్యూ సేవల్లో అత్యంత కీలకంగా ఉన్న విఆర్‌ఎలను పార్టుటైమ్‌ ఉద్యోగులని చెప్పి పూర్తిస్థాయిలో సేవలకు వినియోగిస్తున్నారని చెప్పారు. వారికి పే స్కేల్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు ఇచ్చే డిఎలను విఆర్‌ఎలకు గతంలో చెల్లించి వాటిని తిరిగి వేతనాల నుంచి ఇప్పుడు రికవరీ చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల అరకొర జీతాలతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రికవరీని నిలుపుదల చేసి డిఎలను యదాతథంగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనారోగ్య కారణాలతో విఆర్‌ఎ అస్వస్థతకు గురైనపుడు వారి కుటుంబంలో ఒకరు నామినీలుగా విధులు నిర్వర్తిస్తున్నారని, బ్రిటిష్‌ కాలం నుంచి ఈ విధానం కొనసాగుతోందన్నారు. నామినీలుగా పనిచేస్తున్న వారసులను విఆర్‌ఎలుగా గుర్తించాలన్నారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగోన్నతులు 30 శాతానికి పెంచి అర్హులైన వారందరికీ ఉద్యోగోన్నతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. విఆర్‌ఎల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.సూర్యనారాయణ, టి.త్రినాథరావు మాట్లాడుతూ మాట్లాడుతూ జిల్లాలో 1500 మంది విఆర్‌ఎలు పనిచేస్తున్నారని, వీరంతా బడుగు బలహీనవర్గాలకు చెందిన వారేనని చెప్పారు. కనీస వేతనాలు చెల్లించకపోగా, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలనూ అందించడం లేదన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.