*ఆదాయం పెంపునకు చర్యలు
*ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు
ప్రజాశక్తి - పలాస, టెక్కలి రూరల్ : రాష్ట్రంలో 12 లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులన్నీ తొలగించి, వాటి స్థానంలో 1500 డీజిల్, వెయ్యి ఎలక్ట్రికల్ కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్.ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఇందులో భాగంగా తొలి విడతలో 1600 బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. టెక్కలి, పలాస ఆర్‌టిసి డిపోలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌టిసి పురోభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఆదాయ మార్గాల కోసం ఆర్‌టిసి స్థలాలను జీరో ఎస్ కింద 15 ఏళ్లు, కమర్షియల్ స్థలాలు అయితే 33 ఏళ్ల తాత్కాలిక లీజుకు ఇస్తున్నట్లు వివరించారు. ఆ స్థలాల్లో తాత్కాలిక భవన నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో టెక్కలి ఆర్‌టిసి డిపోలో 3.13 ఎకరాలను లీజుకు ఇచ్చారని, వాటిని కొనసాగిస్తారా అని విలేకరులు ప్రశ్నించారు. 2017లో లీజుకు ఇవ్వడమైందని, రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉండగా నేటికీ చేపట్టలేదన్నారు. ఆర్‌టిసి ప్రభుత్వంలో విలీనమైంది కాబట్టి దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. స్థలాలు అన్యాక్రాంతం కాకుండా సంరక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు. పరస్పర ఒప్పందాల ద్వారా అంతర్రాష్ట్ర సర్వీసులు నిర్వహిస్తున్నామన్నారు. దీనివల్ల రవాణా సౌకర్యంతో పాటు ఆదాయం పెరుగుతుందని తెలిపారు. కార్గో సర్వీసుల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటున్నామని చెప్పారు. ఉత్తరాంధ్రలో చివరి డిపోగా పలాస ఉందని, వాణిజ్యపరంగా ఆశించిన ఆదాయం లేదన్నారు. ప్రయాణికులతో సఖ్యతగా వ్యవహరించాలని ఉద్యోగులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.విజరు కుమార్, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ కె.శ్రీనివాసరావు, పలాస డిపో మేనేజర్ ఆర్.సీతారాములు నాయుడు, అసిస్టెంట్ డిపో మేనేజర్ పి.సంతోష్ కుమార్, పలు ఆర్‌టిసి యూనియన్ల నాయకులు పి.వాలి, ఎ.దిలీప్‌కుమార్, డి.చిరంజీవులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.










