Oct 09,2023 23:09

పాదయాత్రలో మాట్లాడుతున్న పాశం రామారావు

ప్రజాశక్తి - దుగ్గిరాల : హైలెవెల్‌ ఛానల్‌ కింద పొలాలకు వెంటనే సాగునీరిచ్చి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు డిమాండ్‌ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర 7వ రోజుకు చేరింది. దుగ్గిరాల మండలంలోని మంచికలపూడిలో సోమవారం పాదయాత్ర ప్రారంభం కాగా తుమ్మపూడి, చిలువూరు, మంగళగిరి మండలం కాజలో జరిగింది. రాత్రికి మంగళగిరి పట్టణానికి చేరింది. ఆయా ప్రాంతాల్లో పాదయాత్రకు ఘన స్వాగతం పలికిన ప్రజలు తమ సమస్యలను బృందానికి విన్నవించారు. చిలువూరులో రైతులు పాదయాత్ర బృందాన్ని కలిసి తమ పొలాలకు నీరండం లేదని అర్జీనిచ్చారు. హైలెవల్‌ చానల్‌ కింద పొలాలకు నీరు సరఫరా చేయడం లేదని అర్జీలో పేర్కొన్నారు. పెదవడ్లపూడి వద్ద బకింగ్‌హాం కాల్వ ఆధునికీకరణ పనులు గత ప్రభుత్వ హయాంలో చేపట్టినా ఇప్పటికీ కొలిక్కి రాలేదని, ఫలితంగా ఈ ప్రాంతంలో పొలాలకు నీరు అందక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. తమకు గ్రామంలోనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని మరికొంతమంది విన్నవించారు. తమకు కుల ధ్రువపత్రాలు ఇవ్వడం లేదని తుమ్మపూడికి చెందిన ఎస్టీలు వాపోయారు.
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్‌ : అనంతరం కాజ గ్రామానికి చేరిన పాదయాత్రకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. వాటర్‌ ట్యాంక్‌ నుండి పూల వర్షంతో గ్రామంలోకి ఆహ్వానించారు. తొలుత గ్రామ శివారు పొలాల్లోని కూలీలు, రైతులను పాదయాత్ర బృందం కలిసి వారి సమస్యలను తెలుసుకుంది. సాగునీరు సరిగా విడుదల చేయకపోవడం, వర్షాల ఆలస్యం, విత్తన సమయంలోనూ సరైన వర్షాల్లేకపోవడం తదితర కారణాలతో పొలం బెట్టకొచ్చి విత్తనాలు మొలవడం లేదని రైతులు వాపోయారు. రామారావు మాట్లాడుతూ హై లెవెల్‌ ఛానల్‌ పనులు పూర్తయినా విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఫలితంగా ఐదు మండలాలకు చెందిన సుమారు 25 వేల ఎకరాల్లో సాగు ఇబ్బందుల్లో పడిందన్నారు. గ్రామంలో ఎన్నో ఏళ్ల కిందట ఇళ్లేసుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలివ్వకపోగా ఖాళీ చేయాలంటూ అధికారులు భయాందోళనకు గురి చేస్తున్నారని, ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను క్రమబద్ధీకరించడంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా కాజా అండర్‌ పాస్‌ వద్ద కొద్దిపాటి వర్షానికే నీరు నిలిచి ఇబ్బందిగా ఉందని, అధికారులు పట్టించుకోవడం లేదని, నంబూరు వెళ్లే రోడ్డు భారీ వాహనాల రాకతో గుంతల మయంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, పుల్లయ్య నగర్‌, ఇతర కాలనీల్లో ఇళ్ల పట్టాల సమస్య తీవ్రంగా ఉందని, పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ ఫలితం దక్కలేదని పాదయాత్ర బృందానికి స్థానికులు వినతిపత్రాలిచ్చారు. తర్వాత పాదయాత్ర చినకాకానిలో పర్యటించింది. అనంతరం మంగళగిరి పట్టణంలోకి ప్రవేశించిన పాదయాత్రకు బైపాస్‌ రోడ్డులోని శ్రీలకీëనరసింహ స్వామి కాలనీ ఘన స్వాగతం లభిచింది. పూల వర్షంతో బృందాన్ని పట్టణంలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు, ఎం.రవి, ఎస్‌ఎస్‌.చెంగయ్య, సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు, పి.బాలకృష్ణ, నాయకులు బి.శ్రీనివాసరావు, ఎం.శివసామిరెడ్డి, జె.బాలరాజు ఎం.నాగమల్లేశ్వరరావు, ఎం.నరసింహారావు, జి.యోహాను, చిరంజీవి, కె.బిక్షాలు, కె.ప్రభాకర్‌రావు, మురళి, వి.నాగేశ్వరావు, ఎం.బాగ్యరాజు, జి.నాగేశ్వరరావు, డి.శ్రీను, క్రాంతి, రాజముని, కె.కరుణాకర్‌, ఇ.ప్రతాపరెడ్డి, ఎ.సాంబిరెడ్డి, బి.కోటేశ్వరి, ఎస్‌.ఆదిశేఖర్‌, ఎస్‌.సుమ, ఎస్‌.నిర్మల, వి.అనసూయ, సత్యమారెడ్డి, గోపాలరెడ్డి, లక్ష్మారెడ్డి, ఎం.సామిరెడ్డి, వై.కమలాకర్‌, ఎం.బాలాజీ, ఎం.చలపతిరావు, కె.వెంకటేశ్వరరావు, జి.దుర్గాప్రసాద్‌, జె.శివభావన్నారాయణ పాల్గొన్నారు.