25 నుండి మహా కుంభాభిషేకం
- ఏర్పాట్లను సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
ప్రజాశక్తి - శ్రీశైలం
శ్రీశైలం క్షేత్రంలో ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహా కుంభాభిషేకం ఏర్పాట్లపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్షించేందుకు శుక్రవారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. శనివారం ఉదయం మహా కుంభాభిషేకం ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహా కుంభాభిషేకం ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కుంభాభిషేకంలో జరగాల్సిన కైంకారాలన్నీ శాస్త్రోక్తంగా పరిపూర్ణంగా నిర్వహించాలని వేదపండితులకు సూచించారు. సమావేశంలో దేవస్థానం కార్య నిర్వహణ అధికారి లవన్న, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ, ఏఈఓలు, దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి పండిత వీరభద్ర దైవజ్ఞ పర్యవేక్షకులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి : రెండు రోజుల పర్యటనకు వచ్చిన దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం కుటుంబ సమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మంత్రి కుటుంబ సమేతంగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకోగానే ఆలయ కార్యనిర్వహణ అధికారి లవన్న, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేదపండితులు సాంప్రపదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ముందుగా మల్లికార్జున స్వామి, ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా, ప్రసాదాలను, జ్ఞాపికను, శేష వస్త్రాలను ఇఒ అందజేశారు.










