ప్రజాశక్తి-గుంటూరు : ముస్లిమ్ మైనార్టీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఈనెల 24న విజయవాడలో జరిగే నిరసనను జయప్రదం చేయాలని అవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.ఎ.చిష్టీ కోరారు. శుక్రవారం బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిష్టీ మాట్లాడుతూ విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో ఉదయం 10 గంటలకు నిరసన కార్యక్రమం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలకే పరిమితమై మైనారిటీలకు సంబంధించిన ప్రత్యేకమైన సంక్షేమ పథకాలు ఏవీ అమలు చేయట్లేదని చెప్పారు. జనాభా ప్రాతిపదికన సబ్‌ప్లాన్ చట్టం అమలు చేయాలని, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో 10 శాతం రిజర్వేషన్లు, అన్యాక్రాం తమైన వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణ, ఉర్దూ భాషాభివద్ధి, విద్యా అర్హతతో నిమిత్తం లేకుండా ప్రతి పేద ముస్లిమ్ కుటుంబానికి దుల్హన్ పథకం ద్వారా రూ.లక్ష ఇవ్వాలని, విదేశీ విద్యను కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీటి సాధన కోసం చేపట్టే నిరసనలో రాష్ట్రంలోని ముస్లిమ్ ప్రజానీకమంతా కదలి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆవాజ్ జిల్లా అధ్యక్షులు షేక్.బాషా, రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్.ఖాశింవలి, నగర అధ్యక్షులు షేక్ సైదా పాల్గొన్నారు.










