ప్రజాశక్తి-గుంటూరు : మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 24వ తేదీన చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ది గుంటూరు మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.సాల్మన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం గుంటూరు, నరసరావుపేటలో బైక్ ర్యాలీలు చేశారు. గుంటూరులోని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకూ బైక్ ర్యాలీ చేయగా ముత్యాలరావు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టి నాలుగేళ్లయినా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న హామీని అమలు చేయలేదన్నారు. కేవలం 10వేల మందినే పర్మినెంట్ చేయటం ఎన్నికల స్టంట్ అన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. సిఎం హామీలు అమలు చేయాలని, పర్మినెంట్, సమాన పనికి సమాన వేతనం, పాత పెన్షన్ విధానం అమలు తదితర డిమాండ్ల సాధనకు చలో విజయవాడ కార్యక్రమంలోగా ప్రభుత్వం స్పందించకపోతే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో అత్యవసర సేవలు నిలుపుదల చేసి, నిరవధికి సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నగర నాయకులు షేక్.గౌస్‌పీరా, ప్రభుదాసు, జి.శ్రీనివాసరావు, బాలప్రసాద్, నాగూర్‌వలి, మరియదాసు, ప్రసాదరావు పాల్గొన్నారు.










