24న చలో విజయవాడ
ప్రజాశక్తి-కావలిరూరల్ : మున్సిపల్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కార్మికులు 24వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని 4వ డివిజన్ మస్టర్ పాయింట్ వద్ద కార్మికులు పిలుపునిచ్చారు. అనంతరం కార్మికులతో సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 4సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని తెలిపారు. కనీస వేతనాలు అమలు చేయలేదని, రిటైర్మెంట్ బెనెఫిట్స్ ఇవ్వలేదని, ఇన్సూరెన్స్ విధానం అమలు చేయలేదని ఇంకా అనేక సమస్యలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు దశల వారీ పోరాటాలను కొనసాగించినా కంటితుడుపు చర్చలతో కాలయాపన చేసిందన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు అలాగే మిగిలి ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్మికులకు ఇచ్చిన పర్మినెంట్ హామీని నేటికీ అమలు చేయలేదని ఇది చాలా అన్యాయమని తెలిపారు. ఉదయాన్నే పట్టణాలను, పల్లెలను శుభ్రపరిచి ప్రజారోగ్యాన్ని కాపాడే మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని తీవ్రంగా విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 24న సిఐటియు రాష్ట్ర కమిటీ చలో విజయవాడ పిలుపు ఇచ్చిందని ఆ పిలుపులో భాగంగా 24వ తేదీన సిఐటియు అనుబంధ కార్మికులు మస్టర్లను నిలిపివేసి చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ పోరాటం ద్వారా నైనా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు తురక సీనయ్య, నాయకులు ఒంగోలు రమేష్, జలదంకి బాబు, ఎస్.ఆనందరావు, మహిళా నాయకులు పి.చిన్నమ్మ, ఆర్.అనురాధ కార్మికులు పాల్గొన్నారు.










