
ప్రజాశక్తి - టెక్కలి: ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఎస్‌ఎ (సమ్మేటివ్ ఎసెస్‌మెంట్) పరీక్షలు ఈనెల 24వ తేదీకి వాయిదా పడ్డాయి. విద్యాశాఖ ముందుగా విడుదల చేసిన పరీక్షల కాలనిర్ణయ పట్టిక తేదీలను మార్చుతూ తాజాగా విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 17 తేదీ నుంచి ఎస్‌ఎ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా గ్రంథాలయ వారోత్సవాలు, సైన్స్ ఎగ్జిబిషన్లు ఉండడంతో ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారు. మెదటి రెండు రోజులు కాంపోజిట్ కోర్సులకు పరీక్షలు నిర్వహించనుండగా, 28వ తేదీ నుంచి అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉన్నత పాఠశాలలకు చెందిన 6, 8, 10 తరగతుల విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనుండగా, 7, 9 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం 1.30 నుంచి 4.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఎప్పటి మాదిరిగానే ఆంగ్లం, తెలుగు మాధ్యమంలో పరీక్షలు నిర్వహిస్తారు. 24న ప్రారంభం కానున్న పరీక్షలు వచ్చే ఏడాది జనవరి ఆరో తేదీ వరకు నిర్వహించనున్నారు. ఏటా జనవరి ఒకటో తేదీ ఐచ్ఛిక సెలవు ఉన్నా, ఎస్‌ఎ పరీక్షల కారణంగా ఆ సెలవును రద్దు చేశారు. ఈ మేరకు నిర్దేశించిన సిలబస్‌లను పూర్తి చేసి విద్యార్థులను సన్నద్ధం చేయనున్నారు.