
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్:యువత గంజాయితో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ అదిరాసింగ్ రాణా హెచ్చరించారు. శనివారం ఆయన స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గొలుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటి గైరం పేట వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఏఎస్‌ఐ పూర్ణచంద్ర రావుకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులు పట్టు పడ్డారని, వీరిని అదుపులోకి తీసుకొని 24 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. మోటార్ సైకిల్ పై నలుగురు గంజాయి రవాణా చేస్తూ ముగ్గురు పట్టుపడ్డారని, ఒక వ్యక్తి తప్పించుకొని పారి పోయాడని తెలిపారు. వీరిలో చాపని రవికుమార్, పెన్నాక చైతన్య కుమార్, కురుప శంకరయ్య అనే ముగ్గురు యువకులు పట్టు బడ్డారన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. యువత గంజాయి రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా యువత అక్రమ సంపాదనకు అలవాటు పడి గంజాయి స్మగ్లింగ్ వైపు మల్లుతున్నారని, దొరికితే భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. ఎటువంటి ఉద్యోగాలకు అర్హులు కారని ఆయన అన్నారు. యువత మత్తుకు బానిస కాకుండా ఉండాలని, తల్లిదండ్రులు వారిపై దృష్టి పెట్టి మంచి మార్గంలో నడుస్తున్నారా లేదా అనేది పరిశీలించాలని తెలిపారు. యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు. ఇంతవరకు డివిజన్లో 45 గంజాయి కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణయ్య, గొలుగొండ సబ్ ఇన్స్పెక్టర్ నారాయణరావు పాల్గొన్నారు.