ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్) సూపరింటెండెంట్‌గా డాక్టర్ కిరణ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నూతన ఓరవడికి శ్రీకారం చుడుతున్నారు. ఆరు రోజులుగా క్యాజువాల్టి విభాగాన్ని పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేస్తూ మార్పులు తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా గురువారం ఆర్‌ఎంఒలతో సమావేశమయ్యారు. క్యాజువాల్టిలో 24 గంటలు ఆర్‌ఎంలు ఉండాల్సిన అవసరం ఉందని, ఇందుకు అనుగుణంగా షిఫ్ట్‌ల వారీగా ముగ్గురు ఆర్‌ఎంఒలు విధుల్లో ఉండి రోగులకు వైద్య సేవలు అందించాలని సూచించారు. సమస్యలేమైనా ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. నర్సింగ్ సూపరింటెండెంట్‌లు బాధ్యతగా వ్యవహరించాలని, నర్సింగ్ సిబ్బంది విధుల విషయంలనూ బాధ్యత తీసుకోవాలని చెప్పారు. అజమాయిషీ లోపం కనిపిస్తోందని, అందువల్ల గ్రేడ్-2లో ఉన్న ముగ్గురు నర్సింగ్ సూపరింటెండెంట్లు షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆల్ట్రా సౌండ్ గది వద్ద అస్తవ్యస్తంగా ఉండటాన్ని ఆయన గమనించారు. రెండు మిషన్‌లలో ఒక మిషన్ పని చేయడం లేదని సిబ్బంది చెప్పడంతో వెంటనే బయో మెడికల్ ఇంజినీరును పిలిపించి మమ్మతులు చేయించారు. మహిళలు, పురుషులకు వేర్వేరు స్కాన్‌లు తీసేవిధంగా ఉండాలన్నారు. ఆసుపత్రి పరిశుభ్రతకు, ఐసియు, క్యాజువాల్టీలలో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు షిఫ్ట్‌ల వారిగా ముగ్గురు ఉండేటట్లు నియమించాలని ఆదేశించారు. ల్యాబ్ 24 గంటల పాటు పని చేయడం లేదని గుర్తించి అక్కడ 24 గంటల పాటు బయో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్లను విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.










