లక్నో : ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. అక్కడి రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. బిజెపి గూటి నుండి బటయకు వస్తున్న నేతలు.. అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కండువాలు కప్పుకుంటుంన్నారు. అయితే అఖిలేష్‌కు పూర్తి మద్దతు తెలిపిన భీం ఆర్మీ.. వెంటనే యూటర్న్ తీసుకుంది. మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు భీం ఆర్మీ అధినేత చంద్ర శేఖర్ ఆజాద్ ప్రకటించారు. దళితులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, వారిని ఎన్నికల బరిలోకి ఆహ్వానించడం లేదని అన్నారు.
అంతకముందు బిజెపిని ఓడించాలంటే ఐక్యత చాలా ముఖ్యమని, అందుకు అఖిలేష్ కూటమికి తాము మద్దతు ఇస్తున్నామని తెలపడం గమనార్హం. 'ఐకమత్యంలో పెద్ద బలం ఉంది. బిజెపి మాయల పార్టీ. ఐకమత్యంతో ఆ పార్టీని ఎదుర్కొగలం. సమస్త సమాజంలోని ప్రజల ప్రాతినిధ్యాన్ని గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూటమి నేతపౖౖె ఉంది. ఈ కూటమి బాధ్యతలను అఖిలేష్ నిర్వహించాలని దళిత సామాజిక వర్గం కోరుకుంటోంది' అని ట్వీట్ చేశారు. మద్దతు ప్రకటించిన 24 గంటలు కూడా గడవకుండానే మద్దతును ఉపసంహరించుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆరు నెలలుగా అఖిలేష్ యాదవ్‌తో ఎన్నికల పొత్తు గురించి ఎదురుచూస్తున్నానని, అయితే మంచి ఫలితాలు కన్పించలేదని, దళితులను ఓటు బ్యాంకుగా తప్ప.. పోటీకి ఆస్కారం ఇవ్వడం లేదని చంద్ర శేఖర్ అన్నారు.










