
ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగం
విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చే కార్యాచరణలో భాగంగా సిపిఎం ఉత్తరాంధ్ర జిల్లాల కార్యదర్శులు ఈ నెల 7న విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షలకు సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పలు చోట్ల ఆవిష్కరించారు.
అనకాపల్లి : విశాఖ ఉక్కు పరిరక్షణ అందరి బాధ్యత అని సిపిఎం నాయకులు ఎ.బాలకృష్ణ, గంట శ్రీరామ్ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు రక్షణకై ఉత్తరాంధ్ర సిపిఎం జిల్లా కార్యదర్శులు ఈనెల 7న ఉదయం 10 గంటల నుంచి, 8వ తేదీ ఉదయం 10 గంటల వరకు జరుగు 24 గంటల దీక్షకు సంబంధించిన పోస్టర్లను గురువారం వారు స్థానిక దొడ్డి రామునాయుడు భవన్‌లో ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలని, స్టీల్ ప్లాంట్‌ను పూర్తి సామర్ధ్యంతో నడపాలని. సొంతగనులు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 24 గంటల దీక్షలో ప్రజలు, కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కె.కోటపాడు : 24 గంటల దీక్ష వాల్ పోస్టర్లను గురువారం సిపిఎం నాయకులు మండలంలోని ఎ.కోడూరులో విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు గండి నాయన బాబు మాట్లాడుతూ 8500 మంది స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు స్టీల్‌ప్లాంట్ విషయమై చిత్తశుద్ధతో కేంద్రంతో పోరాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎర్ర దేవుడు, వనము సూర్యనారాయణ పాల్గొన్నారు.
రాంబిల్లి : మండల కేంద్రంలో 24 గంటలు దీక్షలు గోడపత్రిక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి జి దేవుడు నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్రకే తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటు వాళ్లకు అమ్మాలని కేంద్ర బిజెపి ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె నూకరత్నం, సిహెచ్ పవన్ కుమార్, చింతకాయల మాధవస్వామి, సిహెచ్ నూకన్న తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్ : సిపిఎం కార్యదర్శుల దీక్షలకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం స్థానిక కార్మికుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు మాట్లాడుతూ తెలుగు ప్రజల కష్టాలను, కార్మికులు పోరాటానికి విలువ ఇవ్వకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ స్థలాలను, భవనాలను ముక్కలు చేసి అమ్మదలిచిందని తెలిపారు. మరోప్రక్కన స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన గనుల లీజులు పునరుద్ధరించకుండా రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కాలయూపన చేస్తోందని విమర్శించారు. కేసులకు భయపడి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు బిజేపితో చేతులు కలిపారని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు సాపిరెడ్డి నారాయణముర్తి, అప్పారావు పాల్గొన్నారు.
తగరపువలస : 24గంటల దీక్షను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలని, పూర్తి సామర్థ్యంతో నడపాలని, సొంత గనులు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని, 8,500 మంది నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేయనున్నట్లు పార్టీ భీమిలి జోన్ అధ్యక్షులు ఆర్‌ఎస్‌ఎన్.మూర్తి, నాయకులు ఎస్.అప్పలనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు.