Oct 29,2023 00:51

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, జెసి రాజకుమారి

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో మొదటి విడత కార్యక్రమంలో 24 మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ సెంటర్ల (ఎంపిఎఫ్‌సి) నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. రెండవ విడతలో లక్ష్యంగా పెట్టుకున్న 29 గోడౌన్లకుగాను ఇప్పటికి 25 స్థలాలను గుర్తించామని, గోడౌన్ల ర్మాణాలకు అవసరమైన స్థలాలను త్వరలో గుర్తించి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ నుండి కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, జెసి రాజకుమారి పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మొదటి విడతలో 29 మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లకుగాను 24 గోడౌన్ల నిర్మాణం పూర్తి అయ్యాయని, మిగిలిన 5 గోడౌన్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో వున్నాయని చెప్పారు. రెండో దశలో లక్ష్యంగా పెట్టుకున్న గోడౌన్లకు అవసరమైన స్థలాలను త్వరలోనే గుర్తించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు పాడి రైతులకు రోజువారి ఖర్చులకు స్వల్పకాలిక రుణాలు, పాడి గేదేల కొనుగోలు దీర్ఘకాలిక రుణాలు మంజూరుకు జిల్లాకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మండలాలు వారీగా లక్ష్యాలు కేటాయించినట్లు చెప్పారు. ఇప్పటికే నిర్దేశించిన లక్ష్యాల మేరకు పాడి రైతులను గుర్తించి రుణాలకు దరఖాస్తులు చేయించారని, సహకార బ్యాంకు ద్వారా రుణాల మంజూరుకు ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఒ కె.చంద్రశేఖర్‌రావు, పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ ఎరఇ బ్రహ్మయ్య, సిపిఒ శేషశ్రీ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు, పశుసంవర్థకశాఖ జేడీఏ జెపీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.