Aug 15,2023 20:41

2025కు 'పోలవరం' ద్వారా నీళ్లు
రైతులకు రూ.1.16 కోట్ల పంట నష్టపరిహారం
జగనన్న సురక్షలో 3.89 లక్షల ధృవపత్రాలు అందజేత
పోలవరం నిర్వాసితులకు 32 కాలనీలు
స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్‌
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన, విద్యార్థుల నృత్యాలు
ఉత్తమ అధికారులకు ప్రశంసాపత్రాలు
ఏలూరు - ప్రజాశక్తి ప్రతినిధి

జగనన్న హౌసింగ్‌ స్కీమ్‌లో 1,15,488 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు అందించామని, వాటిలో 23,181 ఇళ్లు పూర్తయ్యాయని రాష్ట్ర రవాణాశాఖ, జిల్లా ఇన్‌ఛార్జిమంత్రి పినిపే విశ్వరూప్‌ తెలిపారు. స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మంగళవారం స్వాతంత్య్ర వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో విశ్వరూప్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాప్రగతిపై మంత్రి ప్రసంగిస్తూ ఇంటిస్థలాల కోసం ప్రభుత్వం రూ.524 కోట్లు ఖర్చు చేసిందని, 1221 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని, 98,874 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశామని వివరించారు. మిగిలిన ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, ఇళ్ల నిర్మాణానికి ఇప్పటి వరకూ రూ.633 కోట్లు ఖర్చుచేశామని చెప్పారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతిహామీని నెరవేర్చడంతోపాటు, మేనిఫెస్టోలో లేని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామన్నారు. విద్య, వైద్యరంగాలలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు సామజిక న్యాయం కల్పించామన్నారు. 'జగనన్న సురక్ష' కార్యక్రమం ద్వారా మూడు లక్షల 90 వేల ధృవపత్రాలు అందించామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా 16.65 లక్షల పౌరసేవలు ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమం ద్వారా 33,566 ఫిర్యాదులు అందగా 96 శాతం పరిష్కరించామన్నారు. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద జిల్లాలో రెండు లక్షల 66 వేల 295 మందికి ప్రతినెలా రూ.63.85 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి 32 వేల డ్వాక్రా సంఘాలకు రూ.1,952 కోట్లు రుణాలుగా అందించామన్నారు. వైఎస్‌ఆర్‌ ఆసరా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, విద్యా కనుక, నాడు-నేడు వంటి పథకాలను అందిస్తున్నామన్నారు. వైఎస్‌ఆర్‌ బడుగు వికాసం ద్వారా ఎస్‌సి, ఎస్‌టిలకు 244 క్లయిములకు రూ.19 కోట్లు ప్రోత్సాహకాలు అందించామని తెలిపారు. 434 వైఎస్‌ఆర్‌ హెల్త్‌ వెల్‌నెస్‌ కేంద్రాలకు శాశ్వత భవనాలు మంజూరు చేశామని, రూ.13 కోట్లతో 54 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు రూ.1,523 కోట్లతో 32 కాలనీలు నిర్మిస్తున్నామన్నారు. గిరిజన సంక్షేమంలో భాగంగా విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాలకు ప్రాధాన్యతిస్తున్నట్లు చెప్పారు. 15 పిహెచ్‌సిలు, రెండు సిహెచ్‌సిలు, 44 హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాల ద్వారా వైద్య సేవలందిస్తున్నామని, 86 మంది గిరిజన యువతకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కు శిక్షణ అందించామని వివరించారు. రైతు భరోసాలో రూ.412 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, రైతు భరోసాకేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందిస్తున్నామన్నారు. జల జీవన్‌ మిషన్‌లో ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయిలు అందిస్తున్నామన్నారు. ఉపాధి హామీలో 111 లక్షల పనిదినాలు కల్పించి రూ.275 కోట్లు వేతనాలుగా చెల్లించామన్నారు.
2025 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. ఇటీవల గోదావరి వరదల కారణంగా ముంపు మండలాల్లోని ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, జిల్లా అధికారులు సకాలంలో స్పందించి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారని మంత్రి అభినందించారు. దేశ స్వాతంత్య్రం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆనాటి స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేసేందుకు మనమంతా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా శాఖ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్‌ తన సందేశంలో పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన 21 మంది జిల్లా అధికారులకు, వివిధ శాఖలకు చెందిన 128 మంది అధికారులకు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి పురుషోత్తం కుమార్‌, జెడ్‌పి చైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌, ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, ఎస్‌పి డి.మేరీప్రశాంతి, జెసి బి.లావణ్య వేణి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీపూజ, జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్ర దామా, ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్‌పర్సన్‌ మధ్యాహ్నపు ఈశ్వరి, డిఆర్‌ఒ మూర్తి, ఆర్‌డిఒ కె.పెంచెల కిశోర్‌, డిఆర్‌డిఎ పీడీ విజయరాజు, డిసిహెచ్‌ఎస్‌ ఎవిఆర్‌.మోహన్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న శకటాలు, విద్యార్థుల నృత్య ప్రదర్శనలు
స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా వివిధ శాఖల అభివృద్ధిపై ప్రదర్శించిన శకటాలు అందరినీ అలంచాయి. జిల్లా విద్యాశాఖ ప్రదర్శించిన శకటానికి మొదటిస్థానం దక్కగా 25వేల నగదు, ప్రశంసాపత్రం అందించారు. రెండోస్థానంలో గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యానికి సంబంధించిన శకటం నిలవగా 15వేల నగదు, మూడో స్థానంలో దిశ రక్షణ సిబ్బందితో రూపొందించిన శకటం నిలవగా రూ.పది వేల నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు అందించారు. వివిధ స్కూల్స్‌కు సంబంధించిన విద్యార్థుల నృత్య ప్రదర్శన అలరించాయి.