ప్రజాశక్తి-అనకాపల్లి : ఈనెల 23న పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నట్టు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 44 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో 24, నర్సీపట్నం డివిజన్లో 20 కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. వీటిపై సూచనలు, సలహాలు తెలియజేయాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు జుత్త వెంకటరమణ, టిడిపి నాయకులు బొలిశెట్టి శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు గంట శ్రీరామ్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కొణతాల హరినాథ్ బాబు, సిపిఐ నాయకులు వైఎన్,భద్రం, బిజెపి నాయకులు ఊడా రమేష్, బీఎస్పీ నాయకులు ఎస్‌ఎస్‌వి రామచంద్రరావు పాల్గొన్నారు.










