Dec 20,2022 00:06

మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

ప్రజాశక్తి-నర్సీపట్నంరూరల్‌:రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఈ నెల 23న నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను పార్టీలకతీతంగా అందరూ పాల్గొనాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తి చేశారు. సోమవారం నర్సీపట్నంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్య న్నపాత్రుడు మాట్లాడుతూ, 23న ప్రపంచ రైతు దినోత్సవం సందర్భంగా ఈ ధర్నా చేస్తే బాగుంటుందని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 23న సిబిఎం కాంపౌండ్‌ నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేస్తామని తెలిపారు. తుపాన్‌ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిని, రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఈ సమావేశంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్‌ సూర్యచంద్ర, జనసేన టౌన్‌ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, సిపిఐ నాయకులు గురుబాబు, బిజెపి కన్వీనర్‌ కాళ్ల సుబ్బారావు, టీడీపీ నేతలు రుత్తల యర్రాపాత్రుడు, అడిగర్ల అప్పలనాయుడు, లాలం శ్రీరంగస్వామి, నందిపల్లి వెంకటరమణ, నర్సీపట్నం జెడ్పీటీసీ సుకల రమణమ్మ నాతవరం మాజీ జెడ్పీటీసీ కరక సత్యనారాయణ, నర్సీపట్నం టౌన్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ పాల్గొన్నారు.
టిడిపితోనే సమగ్ర అభివృద్ధి
మాకవరపాలెం: టిడిపితోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. సోమవారం మండలంలో జంగాలపల్లి పంచాయతీలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆర్‌వై పాత్రుడు, సర్పంచ్‌ అల్లు రామనాయుడు పాల్గొన్నారు.