Sep 14,2023 21:17

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు

కురుపాం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యాన జిల్లాలో ఈనెల 23,24 తేదీల్లో చేపట్టబోయే బైక్‌ యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు కోరారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్రా అభివృద్ధి, ఈ ప్రాంతంలో ఉపాధికి ఉపయోగపడే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి మోడీ ప్రభుత్వం పెడితే కార్మిక సంఘాలు, వామపక్షాలు 800 రోజులకు పైగా పోరాడాయి తప్ప ఏ రాజకీయ పార్టీ ముందుకు రాలేదన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ అమ్మితే ఎంతోమందికి ఉపాధిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటినే ప్రధాన ఎజెండాగా చేస్తూ బైక్‌ ర్యాలీ చేపడుతున్నట్టు తెలిపారు. ఈ యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం పెదగొత్తిలి, నీలకంఠాపురం, జి.శివడ, రస్తాకుంటుబాయి, మొండెంఖల్‌, డి.బారామణిలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. నియోజకవర్గంలో అనేక గిరిజన గ్రామాల్లోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, కొన్ని రోడ్లకు శంకుస్థాపనలు జరిగినా పనులు జరగడంలేదని అన్నారు. అలాగే దీర్ఘకాలికంగా ఉన్న ఏనుగుల సమస్యల, పూర్ణపాడు- లాబేసు వంతెన పనులు పూర్తి చేయాలని, జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల కరువు ఛాయలు కనిపిస్తున్నాయని అన్నారు.కావున ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలకు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు పాల్గొన్నారు.