2.30 గంటల పాటు ఘాట్ రోడ్డులో నిలిచిపోయిన విశాఖ- భద్రాచలం బస్సు
ప్రజాశక్తి -సీలేరు
విశాఖ నుంచి భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్సు మరమ్మతులకు గురై జికె.వీధి మండలం సప్పర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. విశాఖపట్నం డిపో చెందిన ఈ బస్సు సోమవారం ఉదయం 5 గంటలకు విశాఖలో బయలు దేరింది. సాయంత్రం 5 గంటలకు భద్రాచలం చేరాల్సి ఉంది. అయితే సప్పర్లకు ముందు మూడు కిలోమీటర్ల దూరంలో బస్సు బ్రేక్ డ్రమ్ములు పట్టేసి ప్రధాన రహదారి మధ్యలో 2.30 గంటల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సాంకేతిక లోపల సవరించడానికి వారి దగ్గర సరైన పనిముట్లు కూడా లేకపోవడంతో మరింత జాప్యం జరిగింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఇదే సమయంలో విశాఖపట్నం డిపో చెందిన భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సు రావడంతో అది వెళ్లేందుకు మార్గం లేకపోయింది. దీంతో ప్రధాన రహదారికి పక్కనే ఉన్న చెట్లను తొలగించారు. నిలిచిపోయిన బస్సు సాంకేతిక లోపాలు సవరించిన మధ్యాహ్నం 3.30 గంటలకు సీలేరు చేరింది. సీలేరుకు ఒంటిగంటకు రావాల్సిందిగా బస్సు 3.30కు రావడంతో ప్రయాణికులు భోజనాలు లేక ఆకలితో అలమటించారు. ఈ మార్గంలో డొక్కు బస్సులు నడపడం వల్ల ప్రమాదవస్తు ఏ లోయలో పడి ఉంటే ప్రయాణికులు ప్రాణాలు గాల్లో కలిసి పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కండిషన్ ఉన్న బస్సులను ఈ మార్గంలో నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.










