![](/sites/default/files/2023-11/jc_12.jpg)
ప్రజాశక్తి - పార్వతీపురం : డిసెంబరు 2,3 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకొనేలా తెలియజేయాలని జాయింటు కలెక్టరు ఆర్.గోవిందరావు రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 7,70,525 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఏప్రిల్ 15 నుంచి ఇప్పటివరకు 18504 మందిని ఓటరు జాబితాలో చేర్చడం, 21431 తొలగింపులు చేయగా, 74,799 సవరణలు చేశామన్నారు. క్లైములు, అభ్యంతరాలను డిసెంబరు 9 వరకు స్వీకరిస్తామన్నారు. డిసెంబరు 26 నాటికి వాటిని పరిష్కరిస్తామని, జనవరి 5న తుది జాబితా ప్రచురణకు సిద్ధమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం రోజుల్లో పోలింగ్ కేంద్రాలు వద్ద బూత్ స్థాయి అధికారులు ఉంటారని పేర్కొన్నారు. 37 బియులు, 17 సియులు, 49 వివిపాట్లను సాంకేతిక లోపాలు గుర్తించిన కారణంగా బిఇఎల్ బెంగుళూరుకు పంపుతున్నట్టు తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్లపై ప్రజలకు అవగాహన కోసం ప్రత్యేకంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. డిఆర్‌ఒ జె.వెంకటరావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కర్నీ ఓటరుగా చేర్చాలని, చనిపోయిన, శాశ్వతంగా వలసపోయిన, పెళ్లయిన, అనర్హుల పేర్లను తొలగింపులను ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.