Dec 22,2022 00:03

మాట్లాడుతున్న క్రెడారు ప్రతినిధులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : ఎంవిపి కాలనీ బీచ్‌ రోడ్‌ గాదిరాజు ప్యాలస్‌లో ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు క్రెడారు 8వ ప్రాపర్టీ ఎక్స్‌పో నిర్వహించనున్నట్లు క్రెడారు చైర్మన్‌ బాయన శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోని ఒక హోటల్‌లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంతవరకు ఇటువంటి ప్రాపర్టీ ఎక్స్‌పోలు ఏడు నిర్వహించామని, వాటికి మంచి స్పందన రావడంతో, అదే స్ఫూర్తితో 8వ ప్రాపర్టీ ఎక్స్‌పోను నిర్వహిస్తామన్నారు. ఈ ప్రాపర్టీ ఎక్స్‌పోలో క్రెడారులో సభ్యత్వమున్న సుమారు 400 సంస్థలు పాలు పంచుకుంటా యని తెలిపారు. ఈ ఎక్స్‌పోలో ప్లాంట్‌లు, విల్లాలు, ప్లాట్లు, బిల్డింగ్‌ మెటీరియల్స్‌, నిర్మాణ సామాగ్రి, ఆర్కిటెక్చర్‌ ఇంటీరియల్స్‌ డెకరేషన్స్‌, బ్యాంకులకు చెందిన అన్ని రకాలకు చెందిన 100కు పైగా స్టాళ్లు ఉంటాయని చెప్పారు. మూడు రోజులపాటు ప్రతి గంటకు బంగారు నాణెం, మూడు రోజులకు కలిపి బంపర్‌ డ్రా విజేతకు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బహుమతి ఉంటాయని తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు వి.ధర్మేందర్‌, ఎక్స్‌పో 22 కన్వీనర్‌ వి.శ్రీను పాల్గొన్నారు.