బెంగళూరు (కర్నాటక) : బెడ్ కింద 23 పెట్టెల్లో దాచిపెట్టిన రూ.500 నోట్ల కట్టలు మొత్తం రూ.42 కోట్లను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన కర్నాటక రాజధాని బెంగళూరులో జరిగింది. ఈ మొత్తాన్ని రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న ఐటి అధికారులు శుక్రవారం ఉదయం బెంగళూరు నగరం ఆర్టీ నగర్ ఆత్మానంద కాలనీలో ఉన్న ఓ ఫ్లాట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఓ ఇంట్లో పరుపు కింద 23 పెట్టెల్లో దాచిపెట్టిన రూ.500 నోట్ల కట్టలు మొత్తం రూ.42 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫ్లాట్ ఖాళీగా ఉందని, ఇక్కడ ఎవరూ నివసించడంలేదని సమాచారం. ఈ ఫ్లాట్ యజమాని ఎవరన్నది ఐటి అధికారులు వెల్లడించలేదు. ఈ కేసుకు సంబంధించి స్థానికంగా ఓ మాజీ మహిళా కార్పొరేటర్, ఆమె భర్తను అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నగల దుకాణాల యజమానులు, ఇతరుల నుంచి ఈ భారీ మొత్తాన్ని వారు సేకరించినట్లు సమాచారం. ఐటి అధికారులు తరువాతి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.










