Oct 21,2023 21:32

సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు

           ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌   సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 23, 24వ తేదీల్లో మున్సిపల్‌ కార్మికులు చేపట్టనున్న మెరుపు సమ్మెకు ప్రజలు మద్దతు ఇవ్వాలని మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ విజ్ఞప్తి చేశారు. శనివారం స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయ ఆవరణలో ఇంజినీరింగ్‌, పారిశుధ్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలే తమ కుటుంబం అంటూ ముందుకు నడిచిన మున్సిపల్‌ కార్మికులకు ప్రజలంద రూ అండగా నిలవాల్సిన అవసరం ఆసన్నమైంద న్నారు. చెమటోడ్చి అనునిత్యం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుధ్య కార్మికులు, గొంతు ఆర కుండా నీళ్లిచ్చే, ఇంజినీరింగ్‌ సెక్షన్‌ వాటర్‌ సప్లై కార్మికులు, ప్రజలను చీకట్లో ఉంచకుండా వెలుతు రులో ఉండే విధంగా నగరాన్ని విద్యుత్‌ అలంకరణ తో నిరంతరం కష్టపడుతున్న ఎలక్ట్రిషన్స్‌ కార్మికులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నప్పటి కీ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించలేదన్నారు. ఆయా కార్మికులు 25 సంవత్సరాలుగా సేవ చేస్తున్నా ప్రభుత్వాలు కనీసం రక్షణ కల్పించలేకపోతున్నాయ న్నారు. వివిధ రకరకాల కారణాలతో ఇంజినీరింగ్‌ కార్మికుల్ని మూడు సంవత్సరాల కిందట 60 సంవత్సరాల రిటైర్మెంట్‌, ఉద్యోగం నుంచి 13 మందిని తొలగించారన్నారు. నగరం విస్తీర్ణం పెరిగినా అందుకు తగ్గట్టుగా కార్మికులను పెంచడం లేదన్నారు. రెగ్యులర్‌ కార్మికులకు మూడేళ్లుగా సరెండర్‌ లీవ్‌ ఇవ్వకుండా, డిఏలు, ఇంక్రిమెంట్లు రాయకుండా, పనిముట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం మంచిది కాదన్నారు. చాలీచాలని జీతంతోనే కార్మికులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి మున్సిపల్‌ కార్మికులు చేపట్టనున్న మెరుపు సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. అప్పటికీ సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెలో వెళ్లడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో, నగర అధ్యక్షుడు బండారి, ఇంజినీరింగ్‌ సెక్షన్‌ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, నగర కార్యదర్శి మురళి, కోశాధికారి పోతలయ్య, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్‌మూర్తి, ఆది, ప్రభాకర్‌, మహిళా కన్వీనర్‌ మంత్రి వరలక్ష్మి, లక్ష్మీనరసమ్మ, మరియమ్మ, కృపమ్మ, పెద్దక్క, రాజమ్మ, తదితర కార్మికులు పాల్గొన్నారు.