Dec 21,2022 00:06

కూలీలతో మాట్లాడుతున్న గిరిజన సంఘం మండల కార్యదర్శి నాగేశ్వరరావు

ప్రజాశక్తి - చింతూరు
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని ఎజి.కోడేరు గ్రామ సచివాలయాన్ని ఈ నెల 22న ముట్టడిస్తామని గిరిజన సంఘం మండల కార్యదర్శి కారం నాగేశరరావు తెలిపారు. ఎజి.కోడేరు పంచాయతీ పరిధి ఉలుమూరు, మల్లెతోట గ్రామాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి ఆయా గ్రామాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని గ్రామాలు ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. వీధిలైట్లు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని, వరదలకు ఇళ్లు దెబ్బతిన్న, కూలిపోయిన బాధితులకు రూ.10వేలు నష్టపరిహారం ఇవ్వాలని, ఆర్‌బికెల ద్వారా సరఫరా చేసిన విత్తనాలు పంట దిగుబడి రాక నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, ఉపాధి హామీ పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని, సీసీ రోడ్లు నిర్మాణం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పై సమస్యలపై పంచాయతీలోని మూడు గ్రామాల ప్రజలతో ఈ ముట్టడి నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల నాయకులు దర్ముల మల్లయ్య, స్థానికులు నాగరాజు, రమేష్‌, కుమారి, ప్రసాద్‌, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.