ప్రజాశక్తి - పెద్దకడబూరు
ఈనెల 22న చేపట్టే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు ఈడిగ తిక్కన్న కోరారు. సోమవారం మండలంలోని చిన్నతుంబలం గ్రామంలో ఉపాధి కూలీల పని ప్రదేశంలో సమావేశం నిర్వహించారు. కూలీల పని తీరు, కూలీలకు రావాల్సిన వేతనాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తిక్కన్న, రైతు సంఘం నాయకులు పరమేష్, సిఐటియు నాయకులు ఈరన్న, హనుమంతు మాట్లాడారు. ఈశ్వరమ్మకు జాబ్ కార్డు ఉందని, పని ప్రదేశంలో ఆమె చేయి విరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి సాయమూ అందించలేదని చెప్పారు. అలాగే ఎన్ని వారాలు పని చేసినా ఇందిరమ్మకు ఒక్క రూపాయి వేతనం కూడా ఇవ్వలేదని తెలిపారు. సమస్య ఏమిటని మేటీని అడిగితే 'ఈరోజు పడుతున్నాయి. రేపు పడుతున్నాయి.. వచ్చే వారం పడతాయి' అని సమాధానం చెబుతున్నారని అన్నారు. ఆమెకు వేతనం రాలేదని తెలిపారు. ప్రభుత్వం ఉపాధి కూలీలకు నీటి వసతి కల్పించడం లేదు, మెడికల్ కిట్లను అందించడం లేదని చెప్పారు. 200 రోజులు పని కల్పించాలని, రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే పని కల్పించాలని కోరారు. పని ప్రదేశంలో చనిపోయిన కూలీకి వెంటనే ప్రభుత్వం రూ.10 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలు పని ప్రదేశానికి వెళ్లి, రావడానికి 8 కిలోమీటర్ల రవాణా చార్జీ ఇవ్వాలని కోరారు. ఉపాధి కూలీల సమస్యలపై ఈనెల 22న జరిగే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు.
ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న తిక్కన్న










