ప్రజాశక్తి - శ్రీకాకుళం: ఈనెల 22వ తేదీన ఉద్దానం ప్రాంతంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ, జిల్లా వైద్యారోగ్యశాఖ సంయుక్తంగా కిడ్నీ వ్యాధి నిర్ధారణకు ఉచిత రక్త పరీక్షలు, మందుల సరఫరా చేయనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. జిల్లా కోర్టులో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కవిటి మండలంలోని మాణిక్యపురం, కంచిలి మండలంలోని ఎం.ఎస్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య శిబిరం, న్యాయ అవగాహన సదస్సు నిర్వహిస్త్నుట్లు తెలిపారు. ప్రజలందరికీ కిడ్నీ వ్యాధి నిర్ధారణ కోసం రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించి సీరం క్రియాటిన్ లెవల్ పరీక్ష చేసి అవసరమైన వారికి మందులు ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇంతవరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఉద్దాన ప్రాంతంలో తొమ్మిది వైద్య శిబిరాలు నిర్వహించిన 3,151 మందికి రక్త పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. వారిలో 263 మందికి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణలో తేలిందన్నారు. ప్రజలందరూ ముందుగానే రక్త పరీక్షలు చేయించుకుని, మందులు తీసుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు పాల్గొన్నారు.










